సాక్షి, వికారాబాద్: ఇటీవల కాలంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఫైర్ అయ్యారు. తనకు రాజకీయాలు కొత్త అన్న మాజీ మంత్రిని ఉద్దేశిస్తూ.. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2018 ఎన్నికల్లో ప్రజలు తమ నాయకుడు కేసీఆర్‌పై నమ్మకంతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని, మోదీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. గ్రామపంచాయతీల్లో రాష్ట్ర నిధులు లేవనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్‌ని హిందువా అంటున్న బండి సంజయ్‌లో ప్రవహించేది హిందూ రక్తమే అయితే నాగార్జున సాగర్ ఎన్నికల్లో చూసుకుందామని ఛాలెంజ్ చేశారు. హిందువులకు, ముస్లింలకు వేరువేరు రక్తం ఉంటుందా అని ఆయన ఎద్దేవా చేశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్పై అవాక్కులు చవాక్కులు పేలితే బడిత పూజ చేస్తామని హెచ్చరించారు. మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలను బీజేపీ ఇకనైనా మానుకోవాలని సూచించారు. గాలివాటంగా గెలిచిన స్థానాలను చూసుకొని బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నాడని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ క్లాస్ కి క్లాస్, మాస్ కి మాస్ అని, ఆయన తలచుకుంటే బీజేపీ నాయకులు రాష్ట్రంలో తిరగలేరని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment