
సాక్షి, హైదరాబాద్: 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘మేరా భారత్ మహాన్’ అనే కార్యక్రమం క్రింద.. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఓ వైవిధ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన జాతీయ పతాకంలోని అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతాము అని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేస్తోంది.
ఆగస్టు 14వ తేదీ ఉదయం 9-10 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహకరిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంస్థ వెబ్ సైట్ www.viswaguruworldrecords.com లోని గూగుల్ ఫామ్ ను పూరించి సంబంధిత పాఠశాలలు, కళాశాలలు తదితర సంస్థలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ సంస్థలన్నింటికీ పార్టిసిపేషన్ ఈ-సర్టిఫికెట్స్ ఉచితంగానే అందిస్తారు.
ఈ ప్రతిజ్ఞ ద్వారా అశోక ధర్మ చక్రంలోని 24 ఆకులు సూచించే 24 విలువల ప్రాముఖ్యం గురించి తెలుసుకోవడంతో పాటు, ఆ గుణాలను అలవర్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపకరిస్తుందని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ భావిస్తోంది. అలాగే మన రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం లో అందరూ పాల్గొని ఇతరులూ పాల్గొనే విధంగా చైతన్య పరచి దేశభక్తి చాటాలని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపక సిఈవో, ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఒక్కరోజే 50 లక్షలు?.. అదీ క్రేజ్ మరి!
Comments
Please login to add a commentAdd a comment