సాక్షి, వరంగల్/ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలో ఎలుక ఘటన కేసులో మరికొందరిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావును ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసింది. తాజాగా మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. వరంగల్ కలెక్టర్ గోపి అధ్యక్షతన ఎంజీఎం వైద్యులకు సంబంధం లేకుండానే అంతర్గత విచారణ వేగిరం చేసినట్టుగా తెలిసింది.
ఎలుక కొరికినా.. ఎందుకు పట్టించుకోలేదు?
భీమారానికి చెందిన శ్రీనివాస్ గత నెల 26న ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. అతడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెస్పిరేటరీ ఇంటర్మీడియట్ కేర్ యూనిట్(ఆర్‌ఐసీయూ)లో చికిత్స అందించారు. అదేరోజు శ్రీనివాస్‌ను ఎలుక కొరికింది. వైద్యులు, సిబ్బంది ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. అక్కడి విభాగాధిపతి, రోగి బాగోగులు చూసుకునే స్టాఫ్‌నర్సులతో పాటు నర్సింగ్ సూపరింటెండెంట్‌ను బృందం విచారించినట్లు సమాచారం. మళ్లీ గురువారం అదే పేషెంట్‌ను ఎలుక కొరికే వరకు ఎందుకు పట్టించుకోలేదని, విధుల్లో అలసత్వంగా ఉన్నారని బృందం నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
ఎంజీఎంను శుక్రవారం సందర్శించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఇప్పటికే అంతర్గత సమావేశంలో ఆర్‌ఐసీయూ ఇన్‌చార్జ్, నర్సింగ్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేయడం చర్యలు తీసుకునేందుకు సంకేతమనే ఎంజీఎం వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో ఉండే ఆర్‌ఐసీయూలోనే ఈ పరిస్థితి ఉంటే.. మిగతా వార్డుల్లో పరిస్థితి ఎలా ఉందనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. పారిశుద్ధ్య పనులు చేసే కాంట్రాక్టు సంస్థ ఏజిల్‌ను కూడా బ్లాక్ లిస్టులో పెడతామని ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించడంతో ఆ సంస్థపై చర్యలకు సంకేతాలిచ్చినట్లయ్యింది. ఇలా ఓ వైపు వైద్యులు, నర్సులు.. మరోవైపు కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటున్నారు.
ఎలుకల కోసం వేట!
ఎలుక కొరికిన ఘటనతో ఎంజీఎంకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో భారీ సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు. శనివారం ఉగాది అయినప్పటికీ చాలామంది పారిశుద్ధ్య కార్మికులు వార్డులను శుభ్రం చేయడం కనిపించింది. మురుగు కాల్వల్లో నీరు ఎక్కడా ఆగకుండా చర్యలు తీసుకున్నారు. ఎలుకల కోసం మరిన్ని బోనులు ఏర్పాటు చేశారు. ఆయా బోనుల్లో చిక్కిన కొన్ని ఎలుకలను దూరంగా విడిచివచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment