ప్రీతి మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి నరేందర్‌నాయక్
కొడకండ్ల/దేవరుప్పుల: వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె అంత్యక్రియలు స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి రెవెన్యూ పరిధిలోని గిర్నితండాలో సోమవారం ముగిశాయి. ధరావత్ నరేందర్, శారదల మూడో కూతురైన ప్రీతి గత బుధవారం కాలేజీ సీనియర్ సైఫ్ వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఐదు రోజులపాటు హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందిన ఆమె ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం ఉదయం 6:30 గంటలకు గిర్నితండాకు తెచ్చారు. ప్రీతి మృతదేహం వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అంతిమయాత్రలో మంద కృష్ణమాదిగ, బీజేపీ, గిరిజన సంఘాల నాయకులు పాడె మోశారు. ఆ తరువాత గిరిజన సంప్రదాయ పద్ధతిలో వారి వ్యవసాయ భూమిలో ఖననం చేశారు.
ప్రీతికి పలువురి నివాళి
ప్రీతికి గ్రామస్తులతోపాటు రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ ఎల్.లక్ష్మీనారాయణనాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండి శ్రీధర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు నివాళులర్పించారు.
ప్రీతి మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలంటూ బీజేపీ నాయకులు గిర్నిబావితండా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ
గాంధీఆస్పత్రి: ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించగా, మృతదేహాన్ని గాంధీమార్చురీకి తరలించే క్రమంలో కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు అడ్డుకున్న విషయం విదితమే. దీంతో ఆదివారం రాత్రి నుంచి గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. ఆస్పత్రిలోకి మీడియాను అనుమతించలేదు. రోగులు, రోగి సహాయకులను ధ్రువీకరణ పత్రం చూపించాకే ఆస్పత్రిలోకి అనుమతించారు.
అర్ధరాత్రి 1.46 గంటలకు ప్రీతి మృతదేహం గాంధీ మార్చురీకి వచ్చింది. ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ కృపాల్‌సింగ్ నేతృత్వంలో వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. అనంరతం వేకువజాము 4.15 గంటలకు ప్రత్యేక అంబులెన్స్‌లో స్వగ్రామానికి ప్రీతి మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతదేహాం గాంధీ మార్చురీకి వచ్చినప్పటి నుంచి పోస్టుమార్టం పూర్తయి అంబులెన్స్‌లో తరలించేంత వరకు వీడియో చిత్రీకరించారు.
ఉమ్మడి వరంగల్‌వ్యాప్తంగా ఆందోళనలు
సాక్షి నెట్‌వర్క్: ప్రీతి మరణానికి కారకులైన సైఫ్, కేఎంసీ కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కేఎంసీ ఎదుట ఏబీవీపీ నాయకులు, ఎంజీఎం జంక్షన్‌లో బీజేపీ, ఐద్వా నాయకులు ఆందోళనలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి సైఫ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ములుగులో ఎల్‌హెచ్‌పీఎస్, డీవైఎఫ్‌ఐ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
జనగామ జిల్లా కేంద్రంతోపాటు నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి తదితర మండలాల్లో ఏబీవీపీ, వీహెచ్‌పీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐబీఎస్‌ఎస్, మహిళా కాంగ్రెస్, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
కఠినంగా శిక్షించాలి
ప్రీతి తండ్రి నరేందర్
తన బిడ్డలాగా మరొకరికి జరగకూడదని ప్రీతి తండ్రి నరేందర్ నాయక్ రోదిస్తూ చెప్పారు. నిందితుడు సైఫ్‌తోపాటు కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రీతి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వపరంగా రూ.10 లక్షలతోపాటు మంత్రి దయాకర్‌రావు సొంతంగా రూ.20 లక్షలు ఇచ్చి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment