మీరు ఓ విషయాన్ని గమనించారా? మన రాష్ట్రంలో జూలో తప్ప అడవుల్లో ఏనుగులు లేవు. చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ఉన్నాయి. దక్షిణాదిలో అయితే.. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మందలు మందలుగా కనిపిస్తే.. ఇటు ఏపీలోనూ పదుల సంఖ్యలో అటవీ ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. మరి తెలంగాణలో ఎందుకు లేవు? ఇటీవలే ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం దక్కిన నేపథ్యంలో ఏనుగుల మీదకు అందరి దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో అసలు గజరాజు తెలంగాణలో ఎందుకు లేడు? పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు రాడు? అన్న విషయంపై ఓ లుక్కేద్దామా.. – సాక్షి, హైదరాబాద్
ఎందుకు లేవు.. ఎందుకు రావు..
♦తెలంగాణలో ఏనుగులు కనిపించకపోవడానికి ప్రధానంగా భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణం. తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతాలు భౌగోళికంగా దక్కన్ పీఠభూమిపై ఉండటంతోపాటు అడవుల మధ్య ‘డ్రై ఏరియా’ కారణంగా చారిత్రకంగానే ఇక్కడ ఏనుగులు లేవు. తెలంగాణకు ఆనుకుని ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని జిల్లాలన్నీ (పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లోని) పొడి వాతావరణం, వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలే. రాయచూర్, గుల్బర్గా, అకోలా, బీదర్, నాందేడ్ తదితర చోట్లా ఏనుగులు లేకపోవడంతో తెలంగాణలో ఏనుగుల ప్రవేశానికి అవకాశాలు లేకుండా పోయాయి.
♦ఏనుగులు స్థిర నివాసం ఏర్పరుచుకోవాలంటే దట్టమైన అడవులు, పచ్చదనం అవసరం. కనీసం 1,000–1,500 మిల్లీమీటర్ల వర్షపాతముండే ప్రాంతాలు కావాలి. తేమ వాతావరణం ఉండాలి. కనీసం 7, 8 నెలల పాటైనా అడవుల్లోని చెట్లు ఆకులు కలిగి ఉండాలి. గడ్డి ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. ఒక్కో ఏనుగుకు సగటున రోజుకు 150 నుంచి 200 కేజీల మేత అవసరం. ఒక గుంపులో ఐదు ఏనుగులుంటే రోజూ టన్ను మేత కావాలి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి దట్టమైన అడవులు లేకపోవడం వల్ల.. పెద్ద పులులు, ఇతర జంతువులు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి, స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నా ఏనుగులు మాత్రం రావడం లేదు.
♦ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగులున్న చిత్తూరు, విజయనగరం జిల్లాల నుంచి తెలంగాణలోకి రావడానికి ఎలాంటి అడవుల కనెక్షన్ లేదు. మధ్యలో మైదాన ప్రాంతాలను దాటి ఏనుగులు ఇటు వచ్చేందుకు అవకాశాల్లేవు. ఏపీ సరిహద్దుల్లో ఖమ్మంకు ఆనుకుని పశ్చి మగోదావరి, మహబూబ్‌నగర్‌కు ఆనుకుని కర్నూలు, నల్లగొండ వైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏనుగులు లేవు. దీనితో తెలంగాణలోకి వచ్చే పరిస్థితి లేదు.
♦ గతంలో ఉమ్మడి ఏపీలోకి రెండు మార్గాల్లో ఏనుగులు వచ్చాయి. ఒకటి.. చిత్తూరు జిల్లాకు ఆనుకుని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అడవుల నుంచి వచ్చాయి. ఆ రెండు రాష్ట్రాలు కూడా ఏనుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. ఆయా చోట్ల ఏనుగుల సంతతి పెరగడంతో పొరుగునే ఉన్న ఏపీలోకి ప్రవేశించాయి. స్థిరనివాసం ఏర్పరుచుకునే వాతావరణం, పరిస్థితులు ఉండడంతో ఇక్కడే ఉండిపోయాయి.
♦ ఇక రెండోది.. ఒడిశాకు పలుమార్లు భారీ వరదలు రావడంతో సరిహద్దుల్లోని విజయనగరం జిల్లాకు కొన్ని ఏనుగులు వలస వచ్చాయి. తిరిగి వెళ్లకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండిపోయాయి. అదేవిధంగా జార్ఖండ్ నుంచి కూడా ఏనుగులు వలస వచ్చాయి.
చారిత్రకంగా, భౌగోళికంగా, ఇతర ప్రధాన కారణాలతో తెలంగాణలో ఏనుగులు లేవు. ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఏనుగులు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగును నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు.
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పెద్దపులులు అసలు లేకపోవడం, ఇటు తెలంగాణలో ఏనుగులు లేకపోవడంతో.. రెండు ప్రాంతాల్లో పరస్పరం పులులు, ఏనుగులను మార్పిడి చేస్తే బావుంటుందని అంచనా వేశారు. ఈ విధంగా చేయడం ద్వారా మొత్తం ఉమ్మడి ఏపీవ్యాప్తంగా పుష్కలంగా వన్యప్రాణులతో పాటు జీవవైవిధ్యంతో కూడిన మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆశించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. – ఎ.శంకరన్, ఓఎస్డీ, తెలంగాణ అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment