
వైరా(ఖమ్మం): కరోనా కాటుతో కొన్ని గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు బలైన సంఘటన వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో వజనేపల్లి నాగరత్నమ్మ (87) చనిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు ఆమె భర్త నాగేంద్రం (93) కరోనాతో పోరాడుతూ మృత్యువాత పడ్డారు.
వారి కుమారుడు రవి చికిత్స పొందుతున్నాడు. నాలుగు రోజుల కిందట నాగేంద్రం, నాగరత్నమ్మ దంపతులతో పాటు, కుమారుడు రవి కూడా కరోనా బారిన పడ్డారు. ముగ్గురు హోంఐసోలేషన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వృద్ధ దంపతుల ఆరోగ్యం విషమించి ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ఇలా చనిపోయారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో విషాదం నిండుకుంది.