సాక్షి, హిమాయత్‌నగర్: మరణపు అంచుల వరకు వెళ్లిన అభాగ్యురాలికి అన్నీ తామై కింగ్‌కోఠి వైద్య బృందం బతికించారు. నాలుగు రోజులు గడిచేలోపు నవ్వుతూ కనిపించిన ఆ యువతి విగతజీవిగా మారింది. అభాగ్యురాలు ఉన్నట్టుండి సోమవారం కన్ను మూయడంతో ఇటు వైద్యబృందం, అటు తోటి రోగులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొద్దిరోజుల క్రితం గాయాలతో రోడ్లపై సంచరిస్తున్న యువతి(25)ని ఎల్బీనగర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి పంపారు. ఉస్మానియా వారు ఈ నెల 12న కింగ్‌కోఠికి పంపారు. ఒళ్లంతా వికారంగా ఉండటంతో.. ఆమెకు వైద్యం చేసేందుకు సిబ్బంది కూడా వెనకడుగు వేశారు. దీంతో అడిషినల్ సూపరింటెండెంట్ జలజ వెరోనికా ప్రత్యేంగా శ్రద్థ తీసుకుని సిబ్బందితో చికిత్స అందించి, యువతిని శుభ్రంగా చేశారు. కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది.
మళ్లీ పరీక్షలో పాజిటివ్ వచ్చి అనంత లోకాలకు..
‘అభాగ్యురాలికి అన్నీ తానై’ అనే శీర్షికతో ఈనెల 24న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించగా.. పాఠకులు, నెటిజన్లు కింగ్‌కోఠి వైద్యులు, సిబ్బందిని సోషల్ మీడియాలో ప్రశంసించారు. రెండ్రోజుల క్రితం యువతికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా.. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే చికిత్సను కూడా ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో యువతి మృతిచెందింది. దీంతో ఇటు సిబ్బంది, అటు తోటి రోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. యువతి మృతదేహాన్ని తీసుకెళ్లమని ఎల్బీనగర్ పోలీసులకు నారాయణగూడ పోలీసులు సమాచారం ఇచ్చారు. సుమారు 3 గంటలైనా వారు రాకపోవడంతో వార్డులో నుంచి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
చదవండి: అభాగ్యురాలికి అన్నీ తానై.. డాక్టర్ ఔదార్యం
Comments
Please login to add a commentAdd a comment