
మహబూబబాద్: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన బీర్ల నాగమణి (40) కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం మరో ఇద్దరు మహిళలతో కలిసి సమీప అడవిలోకి బోడకాకరకాయలకు వెళ్లింది. కాయలు కోస్తుండగా పాముకాటు వేసింది. ఇది గమనించి ఇద్దరు మహిళలు.. నాగమణిని ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ములుగు తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని భర్త మల్లయ్య తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.