
సాక్షి, హైదరాబాద్: ఓ అందమైన యువతి అనుకోకుండా వీడియో కాల్ చేయడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆమె మాయలో పడ్డాడు. మాయలేడి మాయ మాటలు చెప్పి ఆయనను పీకల్లోతు ప్రేమలోకి తీసికెళ్లింది. కట్ చేస్తే ఆ వీడియోను అడ్డం పెట్టుకుని రూ.లక్షలు కాజేసింది. ఆ వీడియో బయటకు వస్తే తన పరువుపోతుందని భావించిన అతను తనకు న్యాయం చేయాలని కోరుతూ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చంపాపేటకు చెందిన వ్యక్తి ఓ ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్నాడు. విధుల్లో ఉన్న ఆయనకు ఓ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. దానిని లిఫ్ట్ చేయగా అవతలి వైపు అందమైన అమ్మాయి కనిపించింది. మీతో స్నేహాన్ని పంచుకోవాలనుకుంటున్నానంటూ తియ్యని మాటలతో అతడిని రెచ్చగొట్టింది. ఇంటికెళ్లిన తర్వాత కాల్ చేస్తానంటూ చెప్పి అతను కాల్ కట్ చేశాడు. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటరిగా సదరు యువతికి కాల్ చేశాడు. వీడియో కాల్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత కొద్ది సేపటికే ఓ వ్యక్తి కాల్ చేసి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. మీరు ఓ యువతిని భయపెట్టి ఆమెతో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడారని, మేం చెప్పినట్లు వినకపోతే వీడియోకాల్‌ను సోషల్ మీడియాలో పెట్టడమే కాక కేసు ఫైల్ చేస్తామన్నారు. ఈ విషయం బయటికి వస్తే తన పరువు పోతుందనే భయంతో అతను వారికి రూ.5లక్షలు ముట్టజెప్పాడు. ఇంకా కావాలని ఫోన్ చేసి వేధిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: హైదరాబాద్ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు
Comments
Please login to add a commentAdd a comment