ఆత్మకూర్–ఎస్ (సూర్యాపేట):. ఇసుక గుంత ఓ మహిళను మింగింది. ఈ ఘటన మండల పరిధిలోని మక్తా కొత్తగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వీరబోయిన పూలమ్మ(34) పొలం పనుల నిమిత్తం ఏటిలో నుంచి అవతలికి వెళ్తుండగా ఇసుకకోసం తీసిన గుంతలో కాలుజారి పడడంతో నీటిలో మునిగింది. సమీప రైతులు గమనించి ఆమెను రక్షించేలోపే మృతిచెందింది. మృతురాలికి భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇష్టానుసారంగా ఇసుకతవ్వకాలు
పాతర్లపహడ్, ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, ఏపూరు, బొప్పారం, మక్తాకొత్తగూడెం గ్రామల నుంచి బిక్కేరు వాగు వెళ్తుంది. ఈ వాగు నుంచి ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఇసుకతరలిస్తున్నారు. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.వర్షాలు వచ్చినప్పుడు అందులో నీరుచేరడంతో తెలియక పశువులు, మనిషులు ప్రమాదాల బారిన పడుతున్నారు.మక్తా కొత్తగూడెంలో ఏరు దాటే సమయంలో ఎక్కడ గుంతలు ఉన్నయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. రెండు నెలల క్రితం మక్తాకొత్తగూడెం గ్రామానికి చెందిన మహిళ ఏరుదాటుతూ నీటిలో మునిగి మృతిచెందగా ప్రస్తుతం అదే గ్రామానికి చెందిన వీరబోయిన పూలమ్మ ఇసుక తవ్వకంతో ఏర్పడిన గుంతలో జారిపడి మృతిచెందడం ఇసుక మాఫియా ఆగడాలకు నిదర్శనం.
వాగుదాటేదెలా...
మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి 15కిలో మీటర్లకు పైగా వెళ్తున్న బిక్కేరు వాగు అవతల పలు గ్రామాల భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. ఆ భూముల్లో సాగుచేయడానికి రైతులు ప్రమాదమని తెలిసినా దాటకతప్పడంలేదు. వాగు దాటి రైతులు తమ భూముల్లోకి వెళ్లడానికి ఎక్కడా వంతెనలు లేవు. ప్రమాదమని తెలిసినా రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వాగులో నుండే వెళ్తున్నారు. లేదా దూరమైనా వేరే గ్రామాల నుంచి తిరిగివస్తున్నారు. తమ భూములు సాగుకు నోచుకోవాలంటే వంతెనలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment