సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం తొలిరోజే తెలంగాణ ప్రభుత్వం కీలక విజయం సాధించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ అడుగు పెడుతోంది. సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్)కు చెందిన సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెందే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవశాస్త్రాలు (లైఫ్ సైన్సెస్), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారత్‌లో సీ4ఐఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి.
తెలంగాణ అనుకూలతలు, సత్తాకు నిదర్శనం: కేటీఆర్
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు సీ4ఐఆర్ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే ఈ సెంటర్ ఏర్పాటు సాధ్యమైందన్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారత్ అందిపుచ్చుకునేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉద్యోగ, ఉపాధి కల్పనలో హైదరాబాద్ సీ4ఐఆర్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెందే అన్నారు. సీ4ఐఆర్ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఇండియాను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చేందుకు తెలంగాణ నాయకత్వం వహిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ డాక్టర్ శ్యామ్ బిషెన్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు, రోగుల సౌకర్యాలను మెరుగు పరచడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లో సీ4ఐఆర్ సెంటర్
Published Tue, Jan 17 2023 1:26 AM | Last Updated on Tue, Jan 17 2023 3:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment