సాక్షి, హైదరాబాద్: చీకటితో పాటే వెలుగు వస్తుంది.. కల్లోలం వెనుకే ప్రశాంతత ఉంటుంది.. కోవిడ్ అది నిరూపించింది. కొద్ది రోజుల క్రితం వరకు బెంబేలెత్తించిన మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో అన్ని రంగాలు తిరిగి గాడిన పడ్డాయి. ప్రజల మానసిక ఆరోగ్యంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. మానసిక ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్యాప్రవృత్తి వంటి కోవిడ్ వల్ల తలెత్తిన మానసిక రుగ్మతలు క్రమంగా తగ్గుతున్నట్లు మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహమ్మారి నియంత్రణ కోసం లాక్‌డౌన్ విధించడంతో ఒక్కసారిగా ప్రజాజీవనం అతలాకుతలమైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు బ్రేక్ పడింది. కోవిడ్ బారిన పడిన వారిని ఒకరకమైన మానసిక భయాందోళనలు చుట్టుముట్టగా ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందోననేఆందోళన సాధారణ జనాన్ని వెంటాడింది.
ఇంటి నుంచి బయటకు వెళ్లినా, తిరిగి ఇళ్లు చేరుకొన్నా తమతో పాటే కోవిడ్ వచ్చిందేమోననే భయాందోళనకు గురయ్యారు. కానీ లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో పాటు అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కోవిడ్ తర్వాత మానసిక ఆరోగ్యంలో మౌలికమైన మార్పులు వచ్చాయని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధిక ఆచార్య అన్నారు.
అప్పుడు అలా..
- మార్చి నుంచి ఇంచుమించు ఆగస్టు వరకు కోవిడ్ ఉధృతి కొనసాగింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వైరస్ బారిన పడినవారిలో పలువురు మృత్యువాత పడ్డారు. ఈ పరిణామాలు ప్రతి ఇంట్లోనూ భయాందోళన కలిగించాయి.
- లాక్‌డౌన్ కాలంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. మొదట్లో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు పెరిగినా తర్వాత యాంత్రికంగా మారాయి. నిరాటంకంగా కొనసాగిన అనిశ్చితి కల్లోలాన్ని రేపింది.
- మహిళలపై పని భారం పెరిగింది. గృహహింస ఎక్కువైంది. దీంతో చాలా మంది డిప్రెషన్‌కు గురయ్యారు.
- ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోవడం వల్ల చాలాచోట్ల ఆత్మహత్య చేసుకున్నారు.
- రోష్ని వంటి స్వచ్ఛంద సంస్థల సహాయ కేంద్రాలకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు 5 వేలకు పైగా బాధితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
- పోలీస్ సహాయ కేంద్రాలు, షీటీమ్స్ విభాగాలకు సైతం గృహహింస కేసులు వెల్లువెత్తాయి.
- వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది శారీరకంగా పూర్తిగా కోలుకున్నప్పటికీ మానసికంగా డిప్రెషన్‌కు లోనయ్యారు.
- ఇంటిల్లిపాది వైరస్ సోకిన కుటుంబాల్లో ఈ ఆందోళనలు, కుంగుబాటు లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి.
ఇప్పుడు ఇలా..
- అన్‌లాక్ 4.0 తర్వాత 80 శాతానికి పైగా ఆంక్షలు తొలగిపోయాయి. అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్ నుంచి కరోనా కేసులు కొంత మేర తగ్గుముఖం పట్టాయి.
- జనం భయం వీడి బయటకు వచ్చారు. కరోనాతో సహజీవనం తప్పనిసరి అనే అవగాహన పెరిగింది. ఇళ్లకే పరిమితమైన వాళ్లు ఇప్పుడు ఉద్యోగ, వ్యాపారాలకు వెళ్లడమే కాకుండా వీకెండ్స్ కాలక్షేపం కోసం బయటకు వస్తున్నారు. దుర్గం చెరువు, నెక్లెస్‌రోడ్డు వంటి ప్రాంతాలు సందర్శకులతో కనిపిస్తున్నాయి.
ఆన్‌లైన్ పాఠాలతో పిల్లల కుస్తీ..
- స్కూళ్లు, విద్యాసంస్థలు తెరుచుకోకపోవడం వల్ల పిల్లలు ఆన్‌లైన్ చదువులతో కుస్తీ పడుతున్నారు. దీంతో పిల్లలపైన మాత్రం లాక్‌డౌన్ ప్రభావం కొనసాగుతోంది. స్కూళ్లు, కాలేజీ వాతావరణానికి దూరంగా ఉండటం వల్ల మానసిక వికాసానికి ఒకింత అవరోధంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
మార్పు వచ్చింది
నెల రోజులుగా మానసిక సమస్యలతో వచ్చే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. చాలామంది కోవిడ్ భయంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఆ భయం తొలగింది. కోవిడ్‌ను ఎదుర్కోగలమనే భరోసా వచ్చింది. – డాక్టర్ చల్లా గీత, మానసిక వైద్య నిపుణులు,మనోజాగృతి వ్యవస్థాపకులు.
Comments
Please login to add a commentAdd a comment