సాక్షి, పాల్వంచ: ఉమ్మడి జిల్లాలోని అటవీప్రాంతంలో పులుల జాడ కరువైంది. చిరుతల సంచారం కూడా లేదు. దట్టమైన అటవీప్రాంతం తగ్గిపోతుండటంతో అలికిడిలేని ప్రాంతంలో నివసించే మాంసాహార జంతువులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. ఇతర వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. కిన్నెరసాని అభయారణ్యంలోనే 20 వేల హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలో ఏయే రకాల అటవీ జంతువులు, ఎన్నెన్ని ఉన్నాయో తెలుసుకుందాం. భద్రాద్రి జిల్లాలో అటవీ ప్రాంతం 4,27,725 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఖమ్మం జిల్లాలో 62,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2017లో జాతీయ పులుల గణన జరిగింది. ఉభయ జిల్లాలో ఒక్క పులి ఆనవాళ్లు కూడా లభించలేదు. కాగా 2015లో మాత్రం కిన్నెరసాని అభయారణ్యంలోని పడిగాపురం బీట్‌లో పులి సంచారాన్ని గుర్తించారు.
మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో జంతువుల గణన జరిగింది. భద్రాద్రి జిల్లాలోని 6 డివిజన్లు, 24 రేంజ్‌లు, 492 బీట్లు, ఖమ్మం జిల్లాలోని రెండు డివిజన్లు, 81 బీట్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. పులులు, చిరుతల జాడ కన్పించలేదు. గతేడాది కూడా హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్‌జీఓ బృందం వన్యప్రాణుల ఆక్యూపెన్సీ సర్వే నిర్వహించారు. అప్పుడు కూడా పులులు, చిరుతల జాడ కన్పించలేదు. అడవి దున్నలు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, కణుజులు, నెమళ్లు, కుందేళ్లు, కొండముచ్చులు తదితర జంతువులు, పక్షులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కిన్నెరసాని రిజర్వాయర్‌లో వందల సంఖ్యలో మోరేజాతి మొసళ్లు ఉన్నాయి. జంతువుల సంరక్షణకు వైల్డ్‌లైఫ్–1972 వంటి చట్టాలు ఉన్నా వేటగాళ్లు మాత్రం భయపడటంలేదు. నిత్యం వేటాడి వధిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో అటవీ జంతువులను వధించిన కేసులు 25 నమోదయ్యాయి. ఆరు డివిజన్ల పరిధిలో 35 జంతువులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డాయి.
సామాజిక బాధ్యతగా గుర్తించాలి
జిల్లాలో అటవీ జంతువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యత ఒక్క అటవీశాఖది మాత్రమేకాదు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా గుర్తించాలి. –లక్ష్మణ్ రంజిత్ నాయక్, భద్రాద్రి జిల్లా అటవీశాఖాధికారి
సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం
2017లో అభయారణ్యంలో జాతీయ పులుల గణన జరిగింది. పులులు, చిరుతల జాడ కన్పించలేదు. వన్యప్రాణులకు వేసవిలో కృత్రిమ తాగునీటి సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇతర సంరక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నాం. –కె.దామోదర్‌రెడ్డి, వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ, పాల్వంచ
Comments
Please login to add a commentAdd a comment