
విష్ణుపుష్కరిణిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ విగ్రహానికి స్నాన ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో నిత్య పూజలను నిర్వహించిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు.
అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించాక విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్ర ప్రకారం జరిపించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు.