దేవతాహ్వానం పూజ నిర్వహిస్తున్న ఆచార్యులు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపే ధ్వజారోహణాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట బ్రహ్మోత్సవాలకు వచ్చిన రుత్వికులకు ఆలయ ఈఓ గీతారెడ్డి, చైర్మన్ బి.నరసింహమూర్తి దీక్షా వస్త్రాలను సమర్పించారు. సుదర్శన మూలమంత్రం, లక్ష్మీ మూలమంత్రాలు, జపాలు, పారాయణాల అనంతరం స్వామివారిని వివిధ పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించి పురప్పాటు సేవలో బాలాలయంలో ఊరేగించారు.
తెల్లని వస్త్రంపై స్వామివారి వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని వేసి స్వామి, అమ్మవార్ల ఎదుట ప్రత్యేక పూజలు చేశారు. ఆ శ్వేత వస్త్రాన్ని ధ్వజస్తంభానికి అలంకరించి గరుత్మంతుని ఆవాహన చేశారు. గరుత్మంతునికి నైవేద్యంగా గరుడ ముద్దలను నివేదన చేసి ధ్వజస్తంభం ముందు ఎగురవేశారు. ఈ ముద్దలను ప్రసాదంగా స్వీకరిస్తే సౌభాగ్యం, సంతానప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు తీసుకున్నారు. ఈ ప్రక్రియల అనంతరం బాలాలయంలో అగ్నిహోమం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment