సాక్షి, యాదగిరిగుట్ట: కారెనుక కారు.. గుట్ట చుట్టూ హారం తీరు.. భక్తజనం చేరె.. బారులు తీరె.. గోరంత దీపం.. కొండంత వెలుగు.. దివ్వెల వెలుగు.. దివ్యమైన కాంతి.. కొండపైన ఆధ్యాత్మిక సందడి.. ఇదీ ఆదివారం యాదాద్రి సంతరించుకున్న కార్తీక శోభ. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతోపాటు సెలవు రోజు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించి, దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని 23వేలకుపైగా మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
భక్తజన సంద్రం.. యాదాద్రీశుడి క్షేత్రం
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్త జన సంద్రంగా మారింది. సెలవురోజుతో పాటు కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల వాహనాలను కొండకింద గల తులసీ కాటేజీలో, మల్లాపురం వెళ్లే దారుల్లో నిలిపివేసి, ప్రైవేట్ వాహనాల్లో, ఆర్టీసీ, దేవస్థానం బస్సుల్లో కొండపైకి పంపించారు. సరైన పార్కింగ్ స్థలం లేక భక్తులకు ఇబ్బందులు కలిగాయి. స్వామివారిని సుమారు 23వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటలకు పైగా సమయం పట్టిందని పలువురు భక్తులు తెలిపారు.
కాగా సత్యనారాయణస్వామి వ్రతాల్లో 968 జంటలు పాల్గొన్నాయి. దీంతో రూ.4,84,000 ఆదాయం చేకూరింది. ఇక కొండ కింద వాహనాల రద్దీ ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెదటి ఘాట్‌రోడ్డు, రెండవ ఘాట్ దారుల సమీపంలో నుంచి బస్టాండ్ వద్దకు వాహనాలు రావడానికి సుమారు 45నివిుషాల సమయం పట్టింది. ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. యాదాద్రి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శ్రీస్వామి వారికి రూ.36,15,179 ఆదాయం వివిధ పూజల ద్వారా వచ్చిందని అధికారులు తెలిపారు.
యాదగిరీశుడికి విశేష పూజలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆ దివారం ఆచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేకువజామునే బాలాలయాన్ని తెరిచిన అర్చకస్వాములు సుప్రభాత సేవ చేపట్టి, ప్రతిష్ఠామూర్తులను ఆరాధిస్తూ హా రతి నివేధించారు.ఉత్సవ మూర్తులను అభిషేకించి, తులసీ పత్రాలతో అర్చించి, దర్శనామూర్తులకు సువర్ణ పుష్పార్చన చేపట్టి, మండపంలో ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజ, శ్రీసుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేన ఆరాధన, నిత్య కల్యాణ పర్వాలు, సత్యనారాయణస్వామి వ్రతాలను విశేషంగా జరిపారు. సాయంత్రం ఆలయ మండపంలో సేవోత్సవాన్ని నిర్వహించారు.
రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి శయనోత్సవాన్ని నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ ఆవరణలోని క్యూకాంప్లెక్స్‌లో నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక కార్తీక దీపారాధనలో మహిళలు, కొత్తగా వివాహాలైన జంటలు, యువతులు పాల్గొని దీపాలను వెలిగించారు. ఆయా వేడుకల్లో ఆలయ ఈఓ గీతారెడ్డి పాల్గొన్నారు.
శాశ్వత పూజలు ప్రారంభం
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులచే జరిపించే శాశ్వత పూజలను ఆదివారం ప్రారంభించినట్లు ఈఓ గీతారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్–19 కారణంగా ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుంచి ఈ పూజలను రద్దు చేశామని తెలిపారు. కోవిడ్–19 ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో భక్తుల సౌకర్యం దృష్ట్యా పరిమిత సంఖ్యలో ఈ శాశ్వత పూజలను ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. ప్రతి రోజుకు ప్రతి శాశ్వత పూజలో 10 మందికి అనుమతివ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు శాశ్వత పూజల పర్యవేక్షకులు సెల్ నంబర్ 83339 94019, డోనర్ సెల్ విభాగం సెల్ 83339 94025లకు సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment