Agnipath Protests In Hyderabad: Youth Attacked On Secunderabad Railway Station, Details Inside - Sakshi
Sakshi News home page

Agnipath Scheme Protests: సికింద్రాబాద్‌లో అగ్గిరాజేశారు.. వందల కోట్ల ఆస్తి నష్టం!

Published Fri, Jun 17 2022 11:05 AM | Last Updated on Fri, Jun 17 2022 2:34 PM

Youth Attacked On Secunderabad Railway Station to against Agneepath - Sakshi

ఆర్మీలో స్వల్పకాలిక ‍సర్వీసుల పేరుతో వచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ స్టేషన్‌ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు చేరుకున్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ స్టేషన్‌ ఆవరణలో నినాదాలు చేశారు. ఆ తర్వాత ఒకటో నంబరు ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకున్ని బయలుదేరేందుకు సిద్దంగా ఉన్న రైలు ఇంజను ఎదుట బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమం అంతా సవ్యంగా సాగిపోతుందనునే దశలో ఒక్కసారిగా అదుపు తప్పింది.


అదుపు తప్పింది

అప్పటి వరకు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న యువకుల్లో కొందరు అదుపు తప్పారు. రైల్వే ఆస్తులపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇదంతు ఉదయం 9 గంటల సమయంలో మొదలైంది. యువకుల ఆందోళను అదుపు చేసేంత రైల్వే బలగాలు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఆందోళన బీభత్సంగా మారిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఒకటో నంబరు నుంచి మూడో నంబరు ఫ్లాట్‌ఫారమ్‌ వరకు రణరంగంగా మారింది.


అయోమయం

ఓవైపు ఆవేశంలో ఉన్న యువకులు మరోవైపు వారిని కంట్రోల్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ యుద్దక్షేత్రంగా మారిపోయింది. పార్సిల్‌ కార్యాలయంలోకి చొరబడిన యువకులు అక్కడ చేతికి అందిన వస్తువునుల బయటకు తీసుకువచ్చారు. రైల్వ పట్టాలపై వేసి తగుల బెట్టారు. ఇందులో ద్విచక్ర వాహనాలతో త్వరగా మండిపోయే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో క్షణాల్లో స్టేషన్‌ ఆవరణలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియిన అయోమయం నెలకొంది. దీంతో రైళ్లలో ఉన్న ప్రయాణిణులు గందరగోళానికి గురయ్యారు. ప్రయాణం స్టేషన్‌కు వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు.

ఈస్టుకోస్టుకు నిప్పు
స్టేషన్‌లో దట్టమైన పొగలు అలుముకోవడం, మంటలు వ్యాపించడంతో ఇక ఆందోళనకు అడ్డే లేకుండా పోయింది. అరగంట పాటు స్టేషన్‌లో ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. దీంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌కి నిప్పు పెట్టారు. ముఖ్యంగా ఆ రైలులో పార్సిల్‌ కౌంటర్‌ తెరిచే ఉంటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. క్షణాల్లోనే ఇతర బోగీలకు చేరుకున్నాయి. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ అంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఈస్ట్‌కోస్టుతో పాటు అజంతా, ఒక ఎంఎంటీఎస్‌ రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి.

అప్రమత్తం
ఒక్కసారిగా చెలరేగిన ఆందోళనతో ఇటు రైల్వే అధికారులు, అటు రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చే రైళ్లను ఎక్కడిక్కడే నిలిపేశారు. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఇతరులను బయటకు పంపించారు. రాష్ట్ర పోలీసులు బలగాలను అక్కడికి రప్పించారు. అయితే అప్పటికే స్టేషన్‌లో భీతావహా వాతావరణ పరిస్థితి నెలకొంది. లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో ఆందోళన కారులకు పోలీసులు ‍నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీ ఎత్తున నష్టం వాటిల్లింది.


ఫర్నీచర్‌ ధ్వంసం

ఒకటి నుంచి మూడో నంబరు వరకు ఫ్లాట్‌ఫారమ్స్‌పై భారీగా ఆస్తి నష్టం జరిగింది. స్టేషన్‌పై ఉన్న కేఫ్‌టేరియాలో కూడా ధ్వంసం అయ్యాయి. లైట్లు, సీసీ కెమెరాలు, చెత్త కుండీలు ఇలా ప్లాట్‌ఫారమ్‌పై కనిపించిన వస్తువులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు స్టేషన్‌ బయట కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆందోళనలకు బయపడిన ప్రయాణికులు కొందరు తమ వస్తువులను స్టేషన్‌ ఆవరణలోనే వదిలేసి బయటకు పరుగులు తీశారు. మరికొందరు తమ వాళ్లు తప్పిపోయారంటూ ఆందోళన చెందారు. చివరకు ఉదయం 10:30 గంటల సమయంలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ ప్రటకించింది.

టియర్‌గ్యాస్‌
పదిన్నర తర్వాత పోలీసుల బలగాలు భారీగా చేరుకున్నాయి. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. మరోవైపు స్టేషన్‌కు చేరుకున్న ఫైర్‌ ఫైటర్లు మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఆందోళనలో ఇద్దరు మరణించినట్టు వార్తలు వస్తున్నాయ్‌.
 

చదవండి: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement