
నరేశ్(ఫైల్), రవికుమార్ (ఫైల్)
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీపంలో ఉన్న దుసపాటి లొద్ది జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు ఒకరు నీట మునిగి పోతుండటంతో అతడిని రక్షించడానికి వెళ్లి మరొకరు నీటిలో మునిగిపోయాడు. ఎస్సై కొప్పుల తిరుపతిరావు కథనం ప్రకారం.. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం సందర్శనకు వచ్చారు. జలపాతంలో స్నానాలు చేస్తుండగా మునిగెల నరేశ్ (24) ప్రమాదవశాత్తు గుండంలో పడిపోయాడు. అతను ఎంతకూ బయటకు రాక పోవడంతో మిగతా మిత్రులు ఆందోళనకు గురై అక్కడే ఉన్న పర్యాటకులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి తమ సిబ్బందితో పాటు రెస్క్యూ టీంను అక్కడికి పంపించారు. రాత్రి వరకు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. చీకటి కావడంతో గాలింపు నిలిపి వేశారు. గల్లంతైన నరేశ్‌కు తల్లి సమ్మక్క ఉంది. తండ్రి సింగరేణిలో పనిచేస్తూ మృతిచెందడంతో ఆ ఉద్యోగం నరేశ్‌కు వచ్చింది. గత కొంతకాలంగా గోదావరిఖనిలో విధులు నిర్వహిస్తున్న నరేశ్ మూడు నెలల క్రితం భూపాలపల్లికి డిప్యుటేషన్‌పై వచ్చాడు.
కాపాడటానికి వెళ్లి..: నరేశ్ నీటిలో మునిగి గల్లంతు కావడంతో జలపాతం చూడటానికి వచ్చిన రవికుమార్‌చారి (30) అనే యువకుడు అతడిని కాపాడటానికి నీటిలో దిగాడు. అయితే అతను కూడా గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన రవికుమార్‌చారి అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులను నిర్వహిస్తున్నాడు.
వారించినా వినకుండా..: ఈ జలపాతం రిజర్వ్ ఫారెస్టులో ఉండడంతో అటవీ శాఖ సిబ్బంది పర్యాటకులను అక్కడికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు వారిస్తున్నారు. అయినా వినకుండా చాలా మంది వెళ్తున్నారు. గతంలో ఇక్కడ ఒకరు గల్లంతై చనిపోగా, తాజాగా ఇద్దరు గల్లంతయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment