జువ్విగూడెంలో రాజన్న కూతురువా అంటూ.. ఆప్య్ఙా్ఙయంగా పలకరిస్తున్న వృద్ధురాలు
నార్కట్‌పల్లి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్నానని, మీ రాజన్న బిడ్డగా తనను ఆశీర్వదించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కోరారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర 23వ రోజు శనివారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పోతినేనిపల్లి, నెమ్మాని, జువ్విగూడెం, తిరుమలగిరి, మాండ్ర గ్రామాల మీదుగా 9 కిలోమీటర్లు కొనసాగి చిట్యాల మండలం వనిపాకలకు చేరుకుంది.
మాండ్ర గ్రామంలో షర్మిల స్థానిక ప్రజలతో ‘మాట ముచ్చట’నిర్వహించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అడుగగా..ఓ మహిళ మాది పేద కుటుంబం మేము ఉండేందుకు ఇల్లు లేదు కేసీఆర్‌కు ఓటు వేస్తే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పారు. ఏడేళ్లయినా ఇల్లు రాలేదు అని చెప్పుకుంది. మరో మహిళ మాట్లాడుతూ..తన భర్త చనిపోయి ఆరు నెలలైందని, తనకు వితంతువు పెన్షన్ రావడం లేదని చెప్పింది.
ఓ నిరుద్యోగి మాట్లాడుతూ...తెలంగాణ వస్తే తనకు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డానని, కానీ ఉద్యోగం రాక ప్రస్తుతం ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నానని చెప్పాడు. వారి సమస్యలు విన్న అనంతరం షర్మిల మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని ఆమె కోరారు. వైఎస్సార్‌టీపీపై నమ్మకముంచి రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే రైతుకు నచ్చిన పంటలు సాగుచేస్తే వాటికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.
మహిళలకు అభయహస్తం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతుల బ్యాంక్ రుణాల మాఫీ, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, అర్హులు అందరికీ పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మాధవ ఎడవల్లి గ్రామానికి చెందిన మహేంద్రచారి కూతురు కిట్‌బ్యాంకులో జమ చేసిన డబ్బులను పాదయాత్ర ఖర్చుకు వినియోగించాలని షర్మిలకు అందజేసింది. ఆయా గ్రామాల్లో షర్మిల..చేనేత కార్మికులు, దివ్యాంగులు, మహిళలు, గీత కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ఇంజం నర్సిరెడ్డి, నీలం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment