సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే క్రమంలో.. పోలీసులను జీతగాళ్లుగా, తమ కార్యకర్తలుగా అధికార పార్టీ టీఆర్‌ఎస్ వాడుకుంటోందని విమర్శించారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శుక్రవారం తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన ఆమె.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘నేను ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించలేదు. నిందితులను వదిలేసి బాధితులను అరెస్ట్ చేశారు. ఇదే విషయాన్ని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశా’ అని వైఎస్ షర్మిల తెలిపారు. పోలీసులను టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసులనే ప్రచారం కేవలం టీఆర్‌ఎస్ పార్టీకే వర్తిస్తుందని, మిగతా పార్టీలకు కాదని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందన్న ఆమె.. ప్రజల దృష్టిలో చులకన కావొద్దని పోలీసులకు సూచించారు.
ఒకప్పుడు ఉదమ్యపార్టీగా ఉన్న టీఆర్‌ఎస్.. నేడు గుండాల పార్టీగా మారిందన్నారు ఆమె. ఇది తాలిబన్‌ల రాజ్యం అనడానికి ఎలాంటి సంకోచం లేదని చెప్పారు. వీళ్లు(టీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి..) తాలిబన్‌లు కాదా? కేసీఆర్ తాలిబన్ల అధ్యక్షుడు కాదా? అంటూ విమర్శించారు. వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని వైఎస్ షర్మిల తెలిపారు. ఇక్కడుంది రాజశేఖర్ బిడ్డ. ఎక్కడైతే మీరు పాదయాత్రను ఆపారో.. అక్కడి నుంచే మొదలుపెడతానని స్పష్టం చేశారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. అలాగే రాజశేఖర్‌రెడ్డిగారి సంక్షేమ పాలన తీసుకొచ్చేంత వరకు ఆగేది లేదు. నిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారామె.
ఇక ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచే ప్రారంభిస్తానని ఆమె స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలను గమనించాలని తెలంగాణ ప్రజానీకాన్ని ఆమె కోరారు. ఆదివారం నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని, ఈ నెల 14వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment