ముక్తాపూర్‌లో షర్మిలకు రంగు పూస్తున్న మహిళలు
బీబీనగర్/భూదాన్ పోచంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం తనను అవమాన పరిచేలా దాడులకు తెగబడినా పోరాటం ఆపకుండా నిరంతరం నిరుద్యోగ దీక్ష చేశానని, దాని ఫలితంగానే సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు వేశారని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె ప్రజాప్రస్థాన పాదయాత్ర భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రం నుంచి మార్కండేయనగర్, ముక్తాపూర్, చింతబావి, రేవనపల్లి, గౌస్‌కొండ, పెద్దరావులపల్లి మీదుగా బీబీనగర్ మండలానికి చేరింది.
ఇందులో భాగంగా మండలంలోని భట్టుగూడెం గ్రామంలో ప్రజలతో మాట–ముచ్చట కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా కేసీఆర్ తనపై దాడి చేయించారని, అయినా నిరుద్యోగుల కోసం దీక్షను వీడకుండా తెలంగాణ తల్లి సాక్షి గా నిరుద్యోగ యువత కోసం పోరాడుతున్నా నని చెప్పారు. కార్యక్రమాల్లో పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ప్రోగాం కోఆర్డినేటర్ రాజగోపాల్, ప్రచార కన్వీనర్ రమేశ్, నాయకులు సత్యవతి, అతహర్, గణేశ్‌నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment