సాక్షి, హైదరాబాద్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల కొత్తగా ఏర్పాటు చేయనున్న వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఖరారైంది. పార్టీని ఈనెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట రంగులో రూపొందించడం గమనార్హం. జెండాలో 80 శాతం మేరకు పాలపిట్ట రంగు, మిగిలిన 20 శాతం నీలం రంగు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా రూపొందించినట్టు శనివారం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ ఉత్సవాన్ని హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ సెంటర్‌లో నిర్వహించడానికి పార్టీ వర్గాలు సమాయత్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం లోటస్‌పాండ్‌లోని షర్మిల కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. 8వ తేదీన నూతన పార్టీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాలను పూలతో అలంకరించాలని వైఎస్ విగ్రహాల పరిరక్షణ కమిటీ కోఆర్డినేటర్ నీలం రమేశ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment