శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయానికి సోమవా రం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, పండుగలు కావడంతో సుమారు 32 వేల మంది భక్తులు దర్శించుకుని ఉంటారని ఆలయ అధికారులు తెలిపారు. అన్ని రకాల రాహు–కేతు పూజలు సుమారు 4 వేలకు పైగా జరిగాయి. ప్రసాదాలు పెద్ద సంఖ్యలో విక్రయించారు.
నేటి నుంచి పింఛన్ల పంపిణీ
తిరుపతి అర్బన్: ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను మంగళవారం నుంచి పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఆ మేరకు ఇప్పటికే డీఆర్‌డీఏ పీడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డీపీఓతోపాటు పలువురు అధికారులకు ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు. ఏ కారణం చేతనైనా 300 మీటర్ల దూరం కన్నా మించి పింఛన్ ఇవ్వాల్సి వస్తే అందుకు తగిన కారాణాలు వెల్లడించాలని ఆదేశించారు.
ఆర్‌అండ్‌బీ జిల్లా అధికారిగా మధుసూదన్‌రావు
తిరుపతి అర్బన్: ఆర్‌అండ్‌బీ జిల్లా అధికారిగా మళ్లీ మధుసూదన్‌రావు మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. గత ఏడాది డిసెంబర్ 19న ఆయన సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత ఈఈగా పనిచేస్తున్న రెడ్డెయ్యకు ఇన్‌చార్జి జిల్లా అధికారిగా పగ్గాలు అప్పగించారు. అయితే రెడ్డెయ్య సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ క్రమంలో మళ్లీ మధుసూదన్‌రావు 100 రోజుల తర్వాత జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారిగా పగ్గాలు చేపట్టనున్నారు.
శ్రీపద్మావతీ అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
తిరుపతి రూరల్: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద అధికారులు వారికి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయ ముఖమండపంలో వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారికి చేసిన కుంకుమార్చనలో ఉపయోగించిన పసుపు, కుంకుమను అందజేశారు.
నేడు యథావిధిగా పాఠశాలలు
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు ఈ నెల ఒకటో తేదీన యథావిధిగా నిర్వహించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈదుల్ ఫితర్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీన ఆప్షనల్ సెలవును ప్రకటించిందన్నారు. మంగళవారం పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని ఆదేశించారు.


