పచ్చమూక చెరలో చింతగుంట చెరువు
చంద్రగిరి :ప్రకృతి సంపదను అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు. ఇన్నాళ్లు ఇసుక అక్రమ రవాణానే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న పచ్చమూక, ఇప్పుడు గ్రావెల్‌పై పడ్డారు. ఏకంగా చెరువులోని మట్టిని భారీ యంత్రాలతో తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వివరాలు.. చంద్రగిరి మండలం శానంబట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని చింతగుంట చెరువు పూర్తిగా పచ్చ నేతల చెరలోకి వెళ్లిపోయింది. తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లెకు చెందిన ఓ నేత, పాతకాలువకు చెందిన మరో నేత కలిసి చింతగుంట చెరువుపై పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మూడు రోజులుగా చెరువులోని మట్టిని గొల్లపల్లిలోని ఓ వెంచర్‌కు అక్రమంగా తరలించేస్తున్నారు.
ఒక్క రాత్రికి రూ.6లక్షలు
ప్రతి రోజూ రాత్రి 7.30 గంటల నుంచి గ్రావెల్ మాఫియా పడగ విప్పుతోంది. సుమారు 10 టిప్పర్ల ద్వారా ఒక్కో టిప్పర్ 10లోడ్ల చొప్పున సుమారు 100 లోడ్ల వరకు వెంచర్‌కు తరలిస్తున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్క రాత్రికే అధికార పార్టీ నేతలు సుమారు రూ.6లక్షల వరకు జేబులో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా టిప్పర్లకు జాతీయ రహదారి పనుల స్టిక్లర్లను ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పటినైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు గొల్లపల్లెలోని వెంచర్‌కు అక్రమ తరలింపు రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా రవాణా
కఠిన చర్యలు తప్పవు
అనుమతి లేకుండా చెరువుల్లో మట్టి తవ్వడం చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. చింతగుంట చెరువు రెండు మండలాలకు సరిహద్దుగా ఉంది. చెరువులో నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. పనులను అడ్డుకుని, వాహనాలను సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించాం. అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవు.
– శివరామసుబ్బయ్య, తహసీల్దార్, చంద్రగిరి
పచ్చమూక చెరలో చింతగుంట చెరువు


