భగవంతుని సేవకు చేరువ చేసేది ఆగమశాస్త్రమే!
తిరుపతి సిటీ: అర్చకులను భగవంతుని సేవకు చేరువ చేసేది ఆగమశాస్త్రమేనని ఎన్‌ఎస్‌యూ ప్రొఫెసర్ సీ.రంగనాథన్ అన్నారు. ఎస్వీ వేదిక్ వర్సిటీలో 21 రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సిద్ధాంత కార్యశాల బుధవారం ముగిసింది. ముఖ్యఅతిథిగా రంగరాథన్ మాట్లాడారు. ఆగమశాస్త్రంలోని రహస్యాలను తెలుసుకోవాలంటే వర్క్‌షాపులు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. దైవారాధన క్రియలలో లోతైన జ్ఞానాన్ని పొందడం వల్ల లోకానికి మంచి జరుగుతుందన్నారు. శ్రీకాళహస్తి ప్రధాన అర్చకులు పరశురామ గురుకుల్ శివ అద్వైతం, అర్చన ప్రక్రియలో సిద్ధాంత స్వరూపం గురించి వివరించారు. అనంతరం వీసీ రాణి సదాశివమూర్తి వర్క్‌షాపు ప్రాధాన్యతను తెలియజేశారు. రిజిస్ట్రార్ భాస్కరుడు, డీన్ రాజేష్‌కుమార్, సహ సంచాలకులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ భరత్ శేఖరాచార్యులు, డాక్టర్ కార్తికేయన్, డాక్టర్ టీ.బ్రహ్మాచార్యులు, అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.


