వైద్య విధి.. | - | Sakshi
Sakshi News home page

వైద్య విధి..

Apr 4 2025 1:53 AM | Updated on Apr 4 2025 1:53 AM

వైద్య

వైద్య విధి..

వారికి నిబంధనలు అడ్డురావు.. అక్రమాలను ఆపాల్సిన అధికారులు అభ్యంత రం చెప్పరు..ప్రశ్నించేవారు ఎదురుపడరు.. ఇంకేముంది.. ఏ పని చేయాలన్నా చేయి చాపుతారు. ముడుపులు ముట్టజెప్పందే.. ఏదీ జరగదు..వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈ జాఢ్యం పెరిగిపోయింది. కూటమి గద్దె నెక్కిన తరువాత వసూళ్ల పర్వం మర్రిచెట్టు ఊడల్లా పాతుకుపోయింది. వైద్య ఆరోగ్య శాఖను అవినీతి కాలుష్యం ఆవహించింది. ఈ విష సంస్కృతి ఆ శాఖ సిబ్బందికి హానికరంగా మారింది.
వైద్య ఆరోగ్యశాఖలో వసూల్‌ రాజాలు!
● ప్రతి పనికీ మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే ● ఓ ప్రైవేటు ఆస్పత్రి రెన్యువల్‌కు 8 ఏసీలు పంపాలని హుకుం ● డిప్యుటేషన్ల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు వసూలు ● పెండింగ్‌ బిల్లులు పాస్‌ కావాలంటే.. కార్యాలయానికి వస్తువులు ● పదోన్నతి పొందిన ఏఎన్‌ఎంల మూమెంట్‌ రికార్డు కోసం లంచం ● వెలవెలబోతున్న పీహెచ్‌సీలు.. రోగులకు తప్పని తిప్పలు ● పట్టించుకోని అధికార యంత్రాంగం

సాక్షి తిరుపతి ప్రతినిధి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు కిందిస్థాయి అధికారుల పెత్తనం శృతి మించుతోంది. బదిలీ కావాలన్నా.. బిల్లులు పాస్‌ కావాలన్నా వారు అడిగింది సమర్పించుకుంటే పని పూర్తి అయినట్టే. ఆస్పత్రుల రెన్యువల్‌, డిప్యుటేషన్లు, పెండింగ్‌ బిల్లులు పాస్‌ చేయించడానికి, పదోన్నతి పొందిన వైద్య సిబ్బంది మూమెంట్‌ రిజిస్టర్‌ కోసం ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫలితంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అవినీతికి అడ్డాగా మారిపోతోంది. జిల్లా కేంద్రమైన తిరుపతి వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కొందరు యూడీసీలు, ఓ ఇద్దరు కిందస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో యూడీసీలు డిప్యుటేషన్‌పై వచ్చిన వారు, యూనియన్లలో ఉన్న వారు కావడం గమనార్హం. జిల్లాలో 58 పీహెచ్‌సీలు, 26 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారాల్లో తలదూరుస్తూ ఆరోగ్యశాఖను భ్రష్టుపట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల రెన్యువల్‌ కోసం మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని రెన్యువల్‌ కోసం వెళితే.. జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి 8 ఏసీలు పంపమని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చేసేది లేక ఆరు ఏసీలు కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిసింది. కొనుగోలు చేసిన బిల్లులను సైతం తమకే ఇవ్వాలని ఒత్తిడి చేసి తీసుకున్నట్లు జిల్లా కార్యాలయంలోని ఓ అధికారి వెల్లడించారు. ఏసీలను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి బిల్లులు పెట్టి అటు వైపు నుంచి కూడా డబ్బులు మంజూరు చేయించుకుని, జేబులు నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులకు తనిఖీల పేరుతో వెళ్లి వసూళ్ల పర్వానికి తెర తీస్తున్నారు. అవినీతి అధికారుల అండతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఘోరాలు జరుగుతున్నా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లపై పడి కాసులు గుంజుకుంటున్నారు.

మూమెంట్‌ రిజిస్టర్‌కూ మామూళ్లు ఇవ్వాల్సిందే

డిప్యుటేషన్ల వేయించుకున్న వారంతా జిల్లా కార్యాలయం లోనే తిష్ట వేసి కాలక్షేపం చేస్తున్నారు. కొందరు కార్యాలయానికి వచ్చి హాజరు వేయించుకుని వెళ్లిపోతుంటే.. మరి కొందరు జిల్లా కార్యాలయంలో కూర్చొని కును కు తీస్తున్నారు. వీరు నచ్చిన వారికి, రూ.50 వేలు ఇచ్చిన వారిని నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్‌పై కోరిన ప్రాంతానికి పంపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవ ల ఉద్యోగోన్నతులు వచ్చిన ఏఎన్‌ఎంలకు అవసరమైన మూమెండ్‌ రిజిస్టర్ల కోసం ఆ వసూల్‌ రాజాలు వారి నుంచి మామూళ్లు పుచ్చుకుంటున్నట్లు ఏఎన్‌ఎం ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. చేయి తడిపితే కానీ ఇవ్వనని తెగేసి చెప్పినట్లు తెలిపారు. ఇలా ప్రతి ఒక్కరికీ రేటు నిర్ణయించి వసూళ్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరుగుతున్న దందాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి అవినీతి అధికారులు, పనిపాట లేకుండా ఒకేచోట కూర్చొని ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ఇష్టారాజ్యంగా పైరవీలు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు అధికారులు తమ ఇష్టా రాజ్యంగా పైరవీలు నడుపుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని డిప్యుటేషన్లు రద్దు చేయాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. అయినా 29 మందికి డిప్యుటేషన్‌పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ డీఎంహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లింది. డిప్యుటేషన్లు రద్దు చేస్తామని వెల్లడించారు. ఆ తరువాత కూడా డిప్యుటేషన్ల సంఖ్యను 25కు కుదించారు. అనంతరం మరి కొందరిని వారి వారి స్థానాలకు పంపినట్లు చెబుతున్నారు. అయినా ఇప్పటికీ కొందరు అధికారులు జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే తిష్ట వేసి ఉన్నారు. ఓ అధికారి గుట్టుచప్పుడు కాకుండా డిప్యుటేషన్ల వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు చొప్పు న వైద్యులు ఉండాలనే నిబంధనలకు కూటమి ప్రభుత్వం నీళ్లొదిలింది. 17 పీహెచ్‌సీలో ఒక్కొక్కరు వంతున వైద్యులు ఉన్నారు. డిప్యుటేషన్ల పేరుతో కొందరు పీహెచ్‌ వైద్యులు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడం మానేసి, సొంత క్లినిక్‌లో కూర్చొని డబ్బులు సంపాదించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అందుకు శ్రీకాళహస్తిలో పనిచేసిన ఓ వైద్యురాలి నిర్వాకమే ఇందుకు నిదర్శనం. యూడీసీలు కొందరు వారు పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లకుండా సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. బి కొత్త కోటలో పనిచేస్తున్న ఓ ఏఎన్‌ఎం ఐపీ పెట్టింది. ఆ తరువాత సెలవులో ఉండి.. మూడు నెలల తరువాత కార్వేటినగరానికి బదిలీ చేసుకుంది. ఇందుకు ఆమె జిల్లా కార్యాలయంలోని ఓ అధికారికి ముడుపులు చెల్లించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నపాండూరులో హెల్త్‌ అసిస్టెంట్‌ పనిచేసిన వ్యక్తి ఆ పీహెచ్‌సీలో సిబ్బందితో దురుసుగా వ్యవహరిస్తుండడంతో జిల్లా ఆరోగ్యకేంద్రానికి డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. అక్కడి నుంచి నెల్లూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు పైరవీలు చేసుకుని అనధికారికంగా గూడూరుకు చేరుకున్నారు.

వైద్య విధి..1
1/1

వైద్య విధి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement