చిట్టమూరు : మండలంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి కర్కశంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఐదుగురు క్షేత్ర సహాయకులపై వేటు వేసింది. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 23 పంచాయతీలలో గత ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులను తనిఖీలు నిర్వహించి డీఆర్పీలు అవకతవకలను చదివి వినిపించారు. ఇందులో మస్టర్లు సక్రమంగా లేవనే సాకుతో మల్లాం, యాకసిరి, ఆలేటిపాడు, మొలకలపూడి, యాకసిరి, ఆరూరు పంచాయతీల క్షేత్ర సహాయకులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మండలంలో రూ.లక్ష రికిరీకి ఆదేశించినట్టు పేర్కొన్నారు. అనంతరం డ్వామా పీడీ శ్రీనివాస్‌ప్రసాద్ మాట్లాడుతూ పేద వాడి కష్టం విలువ తెలిసిన వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నామన్నారు. విధుల పట్ల అలసత్వం వహించినా, కూలీల పట్ల తమ ప్రవర్తన సక్రమంగా లేకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనికి వచ్చిన ప్రతి కూలీకి రూ.300 దినసరి కూలి వచ్చేలా పని చూపించాలన్నారు. ఏపీడీ వరప్రసాద్, విజిలెన్స్ అధికారి గణేష్, ఎంపీడీఓ మనోహర్‌గౌడ్, ఏపీఓ షీలా పాల్గొన్నారు.
రూ.5.1 లక్షలు రీకవరీ
ఓజిలి: ఉపాధి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సిబ్బందిపై డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ చర్యలు చేపట్టారు. మండల ఏపీఓ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ బహిరంగ సమావేశం నిర్వహించారు. 26 పంచాయతీలలో 2024–25కుగాను రూ.14.2 కోట్లతో ఉపాధిహామీ, పంచాయతీరాజ్ పనులు చేశారు. ఈ పనులకు సంబంధించి నిధులు సక్రమంగా ఖర్చు చేయకపోవడంతో సిబ్బంది నుంచి రూ.5.1 లక్షలు రికవరీకి ఆదేశించారు. అలాగే వెంకటరెడ్డిపాళెం, ఆర్మేనిపాడు గ్రామాలకు చెందిన క్షేత్రసహాయకులు నిధులను దుర్వినియోగం చేశారని విధులు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా టీఏ మహేష్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను అందజేశారు. దీంతోపాటుగా టీఏపై ఏపీడీఓ విచారణకు ఆదేశించారు.


