● మరో పదేళ్లలో మొదటి తరం ఐఐటీగా గుర్తింపు ● 10వ వ్యవస్థాపక దినోత్సవంలో డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ
ఏర్పేడు (రేణిగుంట): తిరుపతి ఐఐటీ రానున్న పదేళ్లలో మొదటి తరం(ఫస్ట్ జనరేషన్) ఐఐటీగా అవతరించబోతోందని ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్.సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో శుక్రవారం 10వ వ్యస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ కంపెనీ వ్యవస్థాపకులు ఆర్‌వీ చక్రపాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఐఐటీ డైరెక్టర్ మాట్లాడుతూ పదేళ్ల తిరుపతి ఐఐటీ ప్రస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిందన్నారు. ఐఐటీ శాశ్వత భవనంలోకి మారేందుకు పదేళ్లు పట్టిందని గుర్తుచేశారు. విద్యార్థులు శాశ్వత భవనంలో చదువుకునే అవకాశాన్ని కల్పించాలన్న సంకల్పంతో తాను కేంద్ర విద్యాశాఖ బృందాన్ని ఒప్పించి సౌత్‌జోన్ క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని 2018 కల్లా శాశ్వత క్యాంపస్‌లోకి చేరుకున్నట్టు తెలిపారు. ఇక్కడ 548 ఎకరాల్లో తాము అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో కూడిన వసతులను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఐఐటీ ప్రాంగణంలో ఫేజ్– ఏ నిర్మాణాలను 2023 అక్టోబర్ కల్లా పూర్తి చేశామన్నారు. సెంట్రల్ లైబ్రరీ, నాలెడ్జ్ సెంటర్, 800 మంది సామర్థ్యంతో ఆడిటోరియం, హెల్త్ సెంటర్ నిర్మాణాలను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వివరించారు. మే 11న టెక్నాలజీ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ఐఐటీని సందర్శించనున్నట్లు తెలిపారు. జూలై 20న ఐఐటీ స్నాతకోత్సవం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ వ్యవస్థాపకులు చక్రవర్తి మాట్లాడుతూ కోర్ ఇంజినీరింగ్ కోర్సులైన మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసి సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


