గూడూరులో క్రిస్ సిటీ కోసం భూ సేకరణ
● ప్రభుత్వ భూములకు తన బినామీ పేర్లు చేర్చి పరిహారాన్ని నొక్కేసే కుట్ర ● అదనంగా ప్రతి ఎకరాకు రూ.లక్ష మంజూరు చేయించిన వైనం ● ఆ రూ.లక్ష కూడా స్థానిక ముఖ్య నేతకే ఇవ్వాలని అనుచరుల ద్వారా ఆదేశాలు ● అవకతవకలు జరుగుతున్నాయంటూ రోడ్డెక్కిన స్థానికులు
అసలు కథ ఇక్కడే మొదలు
శ్రీసిటీ తరహాలో గూడూరు పరిధిలో క్రిస్‌సిటీని ఏర్పాటు చేయాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. క్రిస్‌సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 10,834.50 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతలో 2,228.50 ఎకరాలు సేకరించమని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. భూముల వివరాలు సేకరించడం పూర్తయ్యాక ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం రావడంతో గూడూరుకు చెందిన టీడీపీ ముఖ్యనేత భూ సేకరణ ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పథకం వేశారు. ఆ వెంటనే అధికారుల ద్వారా పట్టా, డీకేటీ, ప్రభుత్వ భూముల వివరాలు తెప్పించుకున్నట్లు గూడూరుకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
కిస్ సిటీ కోసం సేకరించిన భూములు ఇవే
శ్రీసిటీ తరహాలో క్రిస్ సిటీ ఏర్పాటు కోసం సేకరించే భూముల పరిహారాన్ని నొక్కేసేందుకు గూడూరుకు చెందిన ముఖ్యనేత స్కెచ్ వేశారు. తన అనచరులను రంగంలోకి దింపి బినామీ పేర్లతో భారీగా కొల్లగొట్టేందుకు పథకం రచించారు. అధికారులను తన చెప్పుచేతల్లోకి తీసుకుని పేదల పరిహారాన్ని బొక్కేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మతలబుపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. అందరికీ పరిహారం చెల్లించాల్సిందేనంటూ రోడ్డెక్కుతున్నారు.
సాక్షి తిరుపతి టాస్క్‌ఫోర్స్: క్రిస్ సిటీ కోసం సేకరించే భూములకు ప్రభుత్వం కేటాయించిన పరిహారాన్ని నొక్కేసేందుకు టీడీపీ ముఖ్యనేత పెద్ద ప్లాన్ వేశారు. ప్రభుత్వ భూములకు బినామీ పేర్లు చేర్చి.. ఆ భూములకు వచ్చే పరిహారాన్ని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేశారు. మరోవైపు పెంచిన పరిహారాన్ని సైతం కాజేసేందుకు పథకం వేశారు. మొత్తంగా క్రిస్ సిటీకి సేకరించే కోట్లాది రూపాయల భూ పరిహారాన్ని కొల్లగొట్టేందుకు అధికారులు, అనుచరులను రంగంలోకి దించారు. ఈ విషయం లబ్ధిదారులు పసిగట్టి అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
పెంచిన వాటా ముఖ్యనేతకే
ప్రభుత్వ, డీకేటీ, పట్టా భూములు ఎకరాకు రూ.7 లక్షల నుంచి రూ.21.5 లక్షల వరకు పరిహారం ఇవ్వనున్న నేపథ్యంలో.. టీడీపీ నేత ఆ పరిహారంలో వాటా కోసం పథకం వేసినట్టు సమాచారం. చిల్లకూరు, కోట మండలాల పరిధిలోని 11 గ్రామాల్లో తన అనుచరులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఒక్కో గ్రామానికి ఐదుగురు సభ్యులను నియమించారు. ఆ ఐదుగురు సభ్యులు ఏది చెబితే అదే ఫైనల్ చేయాలని అధికారులకు హుకుం జారీ చేశారు. పనిలోపనిగా పరిహారం కింద చెల్లించే నిధులను అదనంగా రూ.లక్ష పెంచాలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేశారు. పథకం ప్రకారం ప్రభుత్వం అదనంగా పెంచి ఇచ్చే ఆ రూ.లక్ష పరిహారాన్ని నేరుగా టీడీపీ ముఖ్య నేతకే చేరేలా అధికారులు, అనుచరులకు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం.
జేసీని అడ్డుకుని నిరసన తెలుపుతున్న లబ్ధిదారులు (ఫైల్)
రికార్డుల్లోకి బినామీలు
క్రిస్ సిటీ కోసం సేకరించే భూముల్లో 500 ఎకరాల ప్రభుత్వ భూములను తన అనుచరులు సాగు చేసుకుంటున్నట్లు వారి పేర్లను రికార్డుల్లో చేర్చమని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఆ 500 ఎకరాలకు వచ్చే మొత్తం పరిహారంలో గూడూరుకు చెందిన టీడీపీ నేతకు 60శాతం, మిగిలిన 40 శాతం అనుచరులు, కొందరు అధికారులకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
భగ్గుమంటున్న లబ్ధిదారులు
పరిహారం స్వాహా చేసే విషయం స్థానికులు, రైతులకు తెలియడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. తిరుపతి జేసీ శుభం బన్సల్ రెండు రోజుల క్రితం చిల్లకూరు మండలం, తమ్మినపట్నంలో పర్యటించారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆయన వాహనాన్ని అడ్డుకుని ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. క్రిస్ సిటీ భూముల పరిహారం విషయంలో బినామీ పేర్లతో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని జాయింట్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళనను విరమించారు.
అడ్డుతగులుతున్న అధికారిపై గుర్రు
ఈ విషయం జిల్లా అధికారికి తెలియడంతో అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం నిధులను కూడా పంపిణీ చేయకుండా ఆపినట్లు తెలుస్తోంది. ఆ అధికారి అడ్డుపడుతుండడంతో అతన్ని బదిలీ చేసేందుకు అమరాతిలోని ముఖ్యనేత సహకారం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గూడూరులో క్రిస్ సిటీ కోసం భూ సేకరణ
గూడూరులో క్రిస్ సిటీ కోసం భూ సేకరణ
గూడూరులో క్రిస్ సిటీ కోసం భూ సేకరణ
గూడూరులో క్రిస్ సిటీ కోసం భూ సేకరణ


