దుర్వాసన వెదజల్లుతున్న పరిసరాలు
మురుగునీరు భూమిలోకి ఇంకడంతో తలెత్తుతున్న అనర్థాలు
వ్యాధులు ప్రబలడంతో ఆందోళన చెందుతున్న ప్రజలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి శివారులోని గాంధీపురం పంచాయతీలో ఉన్న ఓ పాల ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్న వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కలుషితమై మంచినీరు రంగు మారుతోంది. పరిశ్రమ సమీపంలోని నివసించేవారు దుర్వాసన భరించలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. డెయిరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు ప్రజలకు అనర్థాలు తెచ్చిపెడుతున్నా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు. ప్రధానంగా డెయిరీ నుంచి వస్తున్న మురుగునీరు అవిలాల చెరువులో కలుస్తోంది. దీంతో చెరువు వద్ద వాకింగ్ కోసం వచ్చేవారు ముక్కు మూసుకుని నడవాల్సి వస్తోంది.
ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
డెయిరీ నుంచి వస్తున్న వ్యర్థాలతో ఇబ్బందిపడుతున్నామని జిల్లా ఉన్నతాధికారులు, కాలుష్య నియంత్రణ మండలి వారికి వరుసగా ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని గాంధీపురం, అవిలాల పంచాయతీలకు చెందిన పలు కాలనీల వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగడంతో డెయిరీ యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. అప్పట్లో డెయిరీ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారని, కొంతకాలం పాటు బయటకు వదల్లేదని వెల్లడిస్తున్నారు. గత ఆరునెలలుగా మళ్లీ వ్యర్థాలను ఇష్టారాజ్యంగా బయటకు వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రధానంగా డెయిరీకి పక్కనే ఉండే జర్నలిస్ట్ కాలనీలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో ఉండలేక తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని వివరిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెంటనే స్పందించి డెయిరీ నుంచి వ్యర్థాలు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేకుంటే కోర్టును ఆశ్రయించడమే తమకు శరణ్యమని స్పష్టం చేస్తున్నారు.
గుంతల్లోకి చేరుతున్న మురుగు
డెయిరీ చుట్టూ ప్రహరీ గోడ ఉన్నప్పటికీ వ్యర్థాలతో కూడిన మురుగునీరు బయటకు వచ్చి గుంతల్లోకి చేరుతోంది. అందులో గేదెలు, పందులు దొర్లుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. విషజ్వరాలతోపాటు చర్మవ్యాధులకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అవిలాల, గాంధీపురం, మల్లంగుంట పంచాయతీల పరిధిలోని కొన్ని బోర్లు నుంచి వస్తున్న నీరు రంగు మారిపోయింది. దీంతో స్థానికులు మంచి నీటికోసం మినరల్ వాటర్ ప్లాంట్లను ఆశ్రయించాల్సి వచ్చింది. డెయిరీ వ్యర్థాలతో కూడిన నీటిని తాగిన పశువులు సైతం అనారోగ్యానికి గురవుతున్న తెలిసింది.
స్థానికుల ఆవేదన
పాల డెయిరీ వ్యర్థాలతో నిండిన మురుగునీరు భూమిలోకి ఇంకుతోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారి బోరుల్లో నుంచి ఎర్రగా నీరు వస్తోంది. వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా నీటిని శుద్ధి చేసేందుకు కూడా వీలు కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నామని, అలాగే సొంతింటిని వదిలి వేరే చోటుకి వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. డెయిరీ యాజమాన్యానికి తమ సమస్యలు విన్నవించే అవకాశం లేకుండా పోయిందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
నిబంధనలకు పాతర
డెయిరీ నిర్వాహకులు పాల వ్యాపారంలో రూ.కోట్లు ఆర్జిస్తున్నా.. సామాన్యుల జీవితాలతో చెలగాలమాడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం డెయిరీ నుంచి వ్యర్థాలను శుద్ధి చేసి వదలాల్సి ఉంది. అయితే నిబంధనలకు పాతర వేస్తూ యథేచ్ఛగా మురుగును జనం మీదకు వదిలేయడంపై పలువురు మండిపడుతున్నారు. రూ.కోట్లు సంపాదిస్తున్నా.. వ్యర్థాలను శుద్ధి చేసే యంత్రాలను ఎందుకు ఏర్పాటు చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజా రోగ్యంతో ఆడుకుంటున్న డెయిరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా వ్యర్థాలను వదిలేస్తున్న పాల డెయిరీ
ఇష్టారాజ్యంగా వ్యర్థాలను వదిలేస్తున్న పాల డెయిరీ


