కౌన్సిలర్లను బెదిరిస్తున్నారు
చిల్లకూరు : వెంకటగిరి మున్సిపాలిటీలోని 25 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లలో ఆరుగురిని తమ వైపునకు తిప్పుకుని మిగిలిన వారిని బెదిరించి అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించాలని కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌తో కలిసి గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనన్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని కోరారు. కూటమి నేతలు కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కేసులు ఉన్నాయని, వాటిని తిరగదోడి ఇబ్బందులు పెడతామని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఎవరూ ప్రలోభాలకు లొంగకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమి నేతల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. అవిశ్వాసంలో వైఎస్సార్ సీపీ విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
కౌన్సిలర్లకు విప్ జారీ
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి మున్సిపాలిటీలో ఈనెల 9న జరగనున్న అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కౌన్సిలర్ల విప్ జారీ చేసినట్టు నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు విప్ నివేదికలను గూడూరు సబ్‌కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ రాఘవేంద్రమీనన్‌కు కూడా అందజేసినట్టు వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేసేందుకు టీడీపీ కుయుక్తులు పన్నుతోందన్నారు.


