ప్చ్..కాపాడలేకపోయారు!
శ్రీకాళహస్తి: పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి సపర్యలు చేశారు. అన్ని పరీక్షలు నిర్వహించారు. తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రెఫర్ చేయలేక స్థానికంగానే డెలివరీ చేశారు. కానీ బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. ఈ ఘటన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం.. బుచ్చినాయుడుకండ్రిగ మండలం, చెన్నాయగుంటకు చెందిన అభినయ, అంకయ్య దంపతులు. అభినయ నిండు గర్భిణి కావడం.. పురిటి నొప్పులు రావడంతో ఆదివారం ఉదయం 7.50 గంటలకు ఆమె తల్లి నాగమణి కుమార్తెను తీసుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి చేరింది. విధుల్లో ఉన్న నర్సులు స్కానింగ్ తదితర వంటివి పూర్తి చేశారు. బిడ్డకు రెండు పేగులు చుట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. మధ్యాహ్నం వరకు అభినయకు నొప్పులు సరిగా రాకపోవడం.. అప్పటి వరకు విధుల్లో ఉన్న నర్సులు డ్యూటీ దిగిపోవడంతో తర్వాత వచ్చినవారు క్రిటికల్‌గా ఉందని చెప్పి వెళ్లిపోయారు. డాక్టర్ సతీష్, కొంతమంది పీజీ డాక్టర్లు గైనకాలజిస్టు లేకనే డెలివరీ చేయడానికి ప్రయత్నించారు. సాయంత్రం 3గంటల ప్రాంతంలో సూపరింటెండెంట్ విజయలక్ష్మికి ఫోన్ చేసి బయటకు తీసుకెళ్లడం మంచిది కాదని చెప్పడంతో అక్కడే డెలివరీ చేశారు.
ఉలుకూ పలుకూ లేని బిడ్డ
బిడ్డ పుట్టగానే ఉలుకూ పలుకు లేకపోవడంతో వెంటనే తిరుపతికి తీసుకెళ్లాలని అక్కడి డాక్టర్లు సూచించారు. 108 రావడానికి రెండు గంటలు పడుతుందని చెప్పడంతో బంధువులు వెంటనే ఓ ప్రైవేటు అంబులెన్స్‌కు రూ.6,500 చెలించి తిరుపతి రుయాకు తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే బిడ్డ మృతిచెందినట్టు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మూడు రోజులుగా లేని 108 డ్రైవర్లు
ఏరియా ఆస్పత్రిలో మూడు రోజులుగా 108 అంబులెన్స్‌లకు డ్రైవర్లు లేరు. దీంతో సకాలంలో వైద్యం అందక పేద రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్చ్..కాపాడలేకపోయారు!


