అక్రమ అరెస్ట్‌లకు భయపడం | - | Sakshi
Sakshi News home page

అక్రమ అరెస్ట్‌లకు భయపడం

Apr 8 2025 7:47 AM | Updated on Apr 8 2025 7:47 AM

అక్రమ అరెస్ట్‌లకు భయపడం

అక్రమ అరెస్ట్‌లకు భయపడం

● కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉంటాం ● ఆగ్రహం వ్యక్తం చేసిన అభినయ్‌

తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం చేయించే అక్రమ అరెస్ట్‌లు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం కూటమి అరాచక పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు. అయితే కూటమి ప్రభుత్వానికి కొమ్ముగాసే ఎల్లో మీడియా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌ చేసి వారికి భయాన్ని పరిచయం చేయండి అన్నట్లుగా ఆ పత్రిక రాసిన కథనాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉచిత బస్సు, విద్యుత్‌ చార్జీల పెంపు వంటి వాటిపై వినూత్న నిరసనలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌లకు పాల్పడడం సరికాదన్నారు. ఆరేళ్ల క్రితం ప్రత్యేక హోదా కోసం సహకరించని అప్పటి హోంమంత్రి అమిత్‌షా తిరుమలకు విచ్చేసినప్పుడు ఆయన కాన్వాయ్‌పై టీడీపీ నాయకులు చెప్పులు విసిరి నిరసన తెలిపారన్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే అప్పుడు లేని అక్రమ కేసులు, అరెస్ట్‌లు ఇప్పుడు తమపై ఎందుకు పెట్టమని పదేపదే రాస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా, రెడ్‌బుక్‌లో పేర్లను అండర్‌లైన్‌ చేసినా తాము అదరం, బెదరమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామని తెలిపారు. చేతనైతే ఏమి చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్‌ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement