భగ్గుమన్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు

Apr 8 2025 7:47 AM | Updated on Apr 8 2025 7:47 AM

భగ్గుమన్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు

భగ్గుమన్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు

తిరుపతి రూరల్‌: విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు భగ్గుమన్నారు. ఏపీఎస్‌పీడీసీఎల్‌లో కాంట్రాక్టర్లనే కాదు కాంట్రాక్టు కార్మికులను కూడా పట్టించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్న వారిని రెగ్యులర్‌ చేయాలని కోరుతూ తిరుపతి నగరంలో మహా ధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం లక్ష్మీపురం సర్కిల్‌ నుంచి కేశవాయనగుంట ఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేట్‌ కార్యాలయం వద్ద ధర్నానుద్దేశించి పలువురు నాయకులు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా ఒక్క సమస్యా పరిష్కారం కాలేదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పి4 సర్వే పేరిట పేదల బతుకుల్ని పెద్దల దయాదాక్షిణ్యానికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఆదాయం రూ.16 వేల కోట్లు ఉండగా కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కోసం ఒకటిన్నర శాతం కూడా ఖర్చు చేయడం లేదన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక

చిత్తూరు అర్బన్‌: జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి)గా అరుణ సారిక నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మచిలీపట్నంలో పనిచేస్తున్న అరుణ సారికను చిత్తూరు జిల్లా జడ్జిగా బదిలీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న ఇ.భీమారావును అనంతపురం జిల్లా జడ్జిగా నియమించింది. చిత్తూరులోని పోక్సో కోర్టు జడ్జిగా పనిచేస్తున్న ఎన్‌.శాంతిని కడప ఫ్యామిలీ కోర్టుకు, 6వ అదనపు జిల్లా జడ్జి బి.బాబూనాయక్‌ను మచిలీపట్నం ఎస్సీ–ఎస్టీ కోర్టుకు, రాజమహేంద్రవరంలో పనిచేస్తున్న ఆర్‌.శ్రీలతను మదనపల్లె 7వ జిల్లా సెషన్స్‌ జడ్జిగా, రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టు జడ్జి పీవీఎస్‌.సూర్యనారాయణ మూర్తిని మదనపల్లె 2వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జిగా, ఇక్కడ పనిచేస్తున్న బందెల అబ్రహాంను విజయవాడ 7వ అదనపు, జిల్లా సెషన్స్‌ జడ్జిగా, తూర్పుగోదావరి రామచంద్రాపురంలో పనిచేస్తున్న ఎం.శంకర్‌రావును చిత్తూరు పోక్సో కోర్టు జడ్జిగా బదిలీ చేసింది. అలాగే గూడూరు 7వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జిగా పనిచేస్తున్న షమి పర్వీన్‌ సుల్తానా బేగంను గుంటూరు పోక్సో కోర్టుకు, నెల్లూరులో ఫ్యామిలీ కోర్టులో పనిచేస్తున్న కె.వెంకటనాగపవన్‌ను గూడూరు 7వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జిగా బదిలీ చేసింది.

రెగ్యులర్‌ చేయాలంటూ మహాధర్నా

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో న్యాయమూర్తుల బదిలీ

చర్చలకు సానుకూల స్పందన

డిస్కం పరిధిలోని అధికారులు కాంట్రాక్ట్‌ కార్మికులకు అండగా నిలిచారు. తాము చేయగలిగిన పరిష్కారాలను చేయడానికి అభ్యంతరం లేదని సీజీఎం హెచ్‌ఆర్డీ రమణదేవి, డీజీఎంలు మూర్తి, సురేంద్రబాబు, వెంకటరత్నం హామీ ఇచ్చారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులతో చర్చించి వినతి పత్రాలు స్వీకరించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నాను విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement