రెడ్‌బుక్ పాలనలో పచ్చనేతలకే పనిముట్లు
● తమ్ముళ్లకే సబ్సిడీ యంత్రాలు ● కూటమి నేతల లెటర్లే అర్హత ● మండల నేతలు ఇచ్చిన జాబితా ప్రకారమే మంజూరు ● పేద రైతులకు మొండిచెయ్యి
జిల్లాలో వ్యవసాయ పనిముట్ల మంజూరు విషయంలో
అధికారులు, నేతలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రైతులకే సబ్సిడీ పనిముట్లు మంజూరు చేస్తున్నారు. అర్హత కలిగిన పేద రైతులను పక్కన
పెట్టేస్తున్నారు. ఇదేమని అడిగితే నేతల నుంచి సిఫార్సు లేఖ తెమ్మంటున్నారు. లేకుంటే వారి
నుంచి తమకు ఫోన్ చేయించాలని సూచిస్తున్నారు. కూటమి నేతల చుట్టూ తిరగలేక చాలామంది కర్షకులు మిన్నకుండిపోతున్నారు. ఇదే అదునుగా అధికారులు అధికార పార్టీ నేతల సిఫార్సులనే అర్హతగా భావించి పరికరాలు మంజూరు చేస్తున్నారు. దీనిపై అన్నదాతలు రగిలిపోతున్నారు.
తిరుపతి అర్బన్: జిల్లాలో రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. కక్ష్యలు, కుట్రలు, దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. ఇవి చాలదన్నట్టు ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ వ్యవసాయ పరికరాలూ కూటమి నేతలకే చెందుతున్నాయి. అధికారులు సైతం అధికార పార్టీ అధినాయకుల లెటర్లకే ప్రాధాన్యమిస్తున్నారు.
ఇప్పటి వరకు 1,069 దరఖాస్తులు
జిల్లాలో ఇప్పటివరకు రాయితీ వ్యవసాయ పనిముట్ల కోసం 1,069 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటిని అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కూటమి నేతల నుంచి సిఫార్సు లెటర్లు ఇస్తేనే ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. లేదంటే మీ ప్రాంతంలోని అధికార పార్టీకి చెందిన నేత దగ్గర నుంచి ఫోన్ చేయించాలని వ్యవసాయశాఖ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. చేసేది లేక పలువురు పేద రైతులు రాయితీ పనిముట్లపై ఆశలు వదులుకుంటున్నారు. అధికార పార్టీ నేతల అండదండలున్నవారు మాత్రం దర్జాగా పనిముట్లకు పట్టుకుపోతున్నారు.
50శాతం రాయితీ
జిల్లాకు పురుగు మందుల స్ప్రేయర్లు 609, ట్రాక్టర్లకు చెందిన పలు విడిభాగాలు 745, పలు రకాల కట్టర్లు 50 జిల్లాకు వచ్చాయి. మొత్తంగా 1,404 పనిముట్లకు ఇప్పటి వరకు 1,069 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 650 మందికి జిల్లా వ్యాప్తంగా కూటమి నేతల నుంచి లెటర్లు, ఫోన్లు చేయించిన వారికి సిఫార్స్ జాబితాలో రాయితీ పనిముట్లను అప్పగించారు. మిగిలిన వారికి ఈ నెల 15వ తేదీ అందించాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.
డ్రోన్ స్ప్రేయర్లలోనూ సిఫార్సుల జోరు
జిల్లాకు తాజాగా 36 డ్రోన్ యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్ ధర రూ.10 లక్షలు. రైతులకు 80శాతం సబ్సిడీతో వీటిని అందించనున్నారు. ఆ మేరకు రెండు రోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
శిక్షణ లేకుండానే..
గత ప్రభుత్వంలో డ్రోన్ల వినియోగంపై గుంటూరులోని ఆచార్య ఎన్‌జీరంగా యూనివర్సిటీలో రెండు వారాలపాటు కొందరు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థులకు డ్రోన్ యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పట్లో శిక్షణ పొందిన విద్యార్థులతో సంబంధం లేకుండా.. పచ్చ నేతలకు శిక్షణ లేకుండా రాయితీ డ్రోన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
పారదర్శకంగా పంపిణీ
వ్యవసాయ పనిముట్లు రైతులకు పారదర్శకంగా అందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 50 శాతం రాయితీతో వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నాం. అంతేతప్ప మాకు సిఫార్సు లెటర్లు ఎవ్వరూ ఇవ్వలేదు. డ్రోన్ విషయంలోనూ అదేమాదిరిగా పాటిస్తున్నాం.
–ప్రసాద్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
కూటమి
నేతల
చేతుల
మీదుగా
వ్యవసాయ
పనిముట్లు
అందిస్తున్న
అధికారులు
వ్యవసాయ పనిముట్లు
రెడ్‌బుక్ పాలనలో పచ్చనేతలకే పనిముట్లు
రెడ్‌బుక్ పాలనలో పచ్చనేతలకే పనిముట్లు
రెడ్‌బుక్ పాలనలో పచ్చనేతలకే పనిముట్లు


