సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి! | - | Sakshi
Sakshi News home page

సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి!

Apr 9 2025 12:36 AM | Updated on Apr 9 2025 12:36 AM

సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి!

సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి!

● అడ్మిషన్లు చేయకుంటే జీతాలు కట్‌ ● టార్గెట్‌ పూర్తయితేనే ఉద్యోగం పదిలం ● మండుటెండల్లో ఇంటింటికీ క్యాంపెయిన్‌ ● ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బందికి తప్పని తిప్పలు

తిరుపతి ఎడ్యుకేషన్‌: ప్రస్తుతం విద్య వ్యాపారంగా మారింది. విద్యాసంస్థలు వాణిజ్య సంస్థలుగా మారాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. వీధికొకటి ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి. కార్పొరేట్‌ హంగులతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్లు పెంచుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయి. ఉపాధ్యాయులు, అధ్యాపకులకే కాకుండా చిన్నాచితక బోధనేతర సిబ్బందికి టార్గెట్లు విధిస్తున్నాయి. అడ్మిషన్లు చేస్తే జీతాలు ఇస్తామని, ఉద్యోగం సైతం పదిలంగా ఉంటుందని తెగేసి చెబుతున్నాయి. ఈ క్రమంలో అందులో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది టార్గెట్‌ పూర్తిచేసే పనిలో పడ్డారు. మండుటెండల్లో ఇంటింటికీ క్యాంపెయిన్‌ నిర్వహిస్తూ ‘మీ పిల్లలను మా విద్యాసంస్థలో చేర్పించండి’ అంటూ ప్రాధేయపడుతున్నారు.

ఆగస్టు నుంచే అడ్మిషన్ల వేట

ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల సిబ్బంది ఆగస్టు నుంచే అడ్మిషన్ల వేట మొదలు పెడుతున్నారు. పీఆర్వోల పేరుతో సిబ్బందిని నియమించుకుని ఆగస్టులో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల అడ్రెస్‌లను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ల ఇళ్లకు వెళ్లి తమ కళాశాలలో చేర్పించాలంటూ తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఇప్పుడే అడ్మిషన్‌ చేయించుకుంటే ఫీజులో రాయితీ ఇస్తామని చెప్పి నమ్మబలుకుతున్నారు.

మోసపోతున్న తల్లిదండ్రులు

ప్రయివేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ప్రత్యేకతలను గ్రాఫిక్స్‌లో చూపించడంతో తల్లిదండ్రులు ఆకర్షణలో పడి మోసపోతున్నారు. ప్రభుత్వ, స్థానిక ప్రైవేటు పాఠశాలలు మించి తమ విద్యాసంస్థలో ఉన్న సౌకర్యాలను వివరిస్తున్నారు. రోజువారీ టెస్ట్‌లు, ప్రతి రోజూ స్టడీ అవర్స్‌, కంప్యూటర్‌, లైబ్రరీ, ల్యాబ్‌, ప్రతి పండుగ సెలబ్రేషన్‌, ఆటపాటలతో పాటు కరాటే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులు బదిలీ అయితే అదేచోట బ్రాంచ్‌కు విద్యార్థుల బదిలీ సౌకర్యం కల్పిస్తామని కార్పొరేట్‌ స్కూల్‌ సిబ్బంది వివరిస్తున్నారు. విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకొని అడ్మిషన్‌ ఫీజు కట్టించుకునే వరకూ పాఠశాల ఫీజు మాత్రమే చెబుతారు. ఫీజు చెల్లించిన తరువాత బస్సు ఫీజు, యూనిఫామ్‌, బుక్స్‌ ఫీజు అంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌లో ఫిక్స్‌ చేసిన ఫీజులని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు నిలువునా మోసపోతున్నారు.

వేధిస్తూ..టార్గెట్లు విధిస్తూ

జిల్లాలో దాదాపు 2వేలకుపైగా ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపుగా 40 వేల మంది వరకూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఆయా పాఠశాలల నిర్వాహకులు ప్రస్తుత విద్యాసంవత్సరానికి గత సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లోనే అడ్మిషన్ల టార్గెట్‌ విధిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పరీక్షలవ్వగానే పూర్తి స్థాయిలో టార్గెట్‌ను రీచ్‌ అవ్వాలంటూ ఆదేశిస్తున్నారు. టార్గెట్‌ చేస్తేనే జీతం, ఉద్యోగం రెండూ పదిలమంటూ హుకుం జారీచేస్తున్నారు. ఈ నిబంధనలకు పనిచేయాలో.. లేక బయటకు రావాలో.. తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement