39 రోజులు.. జరిమానా రూ.22.8లక్షలు!
● జాతీయ రహదారిపై పోలీసుల నిరంతర తనిఖీలు ● రాంగ్‌రూట్‌లో వెళుతున్న 912 మందిపై కేసులు
తిరుపతి రూరల్ : పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధానంగా రాంగ్‌రూట్‌లో వాహనం నడిపేవారికి జరిమానా విధిస్తున్నారు.
ప్రమాదాల నివారణే లక్ష్యం
తిరుచానూరు వద్ద కలెక్టరేట్ నుంచి సి.మల్లవరం జంక్షన్ వరకు జాతీయ రహదారి సమీపంలోని ప్రధాన కూడళ్ల నుంచి ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు యథేచ్ఛగా రాంగ్ రూట్‌లో వస్తున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రహదారిపై నిరంతరం వాహన తనిఖీలు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచారి, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. రాంగ్ రూట్‌లో వస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించేస్తున్నారు. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. వాహనం పట్టుకున్న తర్వాత ఎవరి సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం లేదు.
వందల సంఖ్యలో కేసులు
జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వచ్చే వాహనాలకు జరిమానాలు విధించే ప్రక్రియను మార్చి 1వ తేదీ నుంచి పోలీసులు చేపట్టారు. ఇప్పటి వరకు కేవలం 39 రోజుల్లో 912 వాహనాలను సీజ్ చేసి 186 కేసులను నమోదు చేశారు. ఈ మేరకు నిందితులు జరిమానా కింద రూ.22.80 లక్షలు కోర్టుకు చెల్లించినట్టు సమాచారం. ఈ మేరకు వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని, రాంగ్ రూట్‌లో రావడం మానుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి రూరల్ మండలంలోని సి.మల్లవరం క్రాస్, రామానుజపల్లి క్రాస్, ఆర్‌సీపురం క్రాస్, తనపల్లె క్రాస్, నారాయణాద్రి ఆస్పత్రి క్రాస్ వద్ద రాంగ్‌రూట్ ప్రయాణం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు.


