వెటర్నరీ వర్సిటీలో మధ్యప్రదేశ్ మంత్రి
తిరుపతి సిటీ : ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో బుధవారం మధ్యప్రదేశ్ మంత్రి లకన్ పాటిల్ పర్యటించారు. ఈ సందర్భంగా వీసీ రమణ, డీన్ వీరబ్రహ్మయ్య, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ శ్రీలతతో సమావేశమయ్యారు. వర్సిటీలో చేపట్టిన పరిశోధనలు, పశువైద్య విద్య, పలు విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశువైద్య శాలను పరిశీలించారు.
సజావుగా దూరవిద్య పరీక్షలు
తిరుపతి సిటీ : ఎస్వీయూ దూరవిద్య విభాగం ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న యూజీ, పీజీ పరీక్షలు సజావుగా సాగుతున్నట్లు డైరెక్టర్ వూకా రమేష్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ దాదాపు 32 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. ప్రధాన కోర్సుల పరీక్షలు ముగిశాయని, యూజీకి చెందిన కొన్ని ప్రత్యేక పరీక్షలు మరో వారంలో ముగియనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు పరీక్షలను పారదర్శకంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చేసినట్లు వెల్లడించారు. సహకరిస్తున్న పోలీస్‌శాఖతోపాటు ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థిని సృజనకు అభినందన
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీలో బీఫార్మసీ విద్యార్థిని వైష్ణవీ హరీష్ తన సృజనాత్మకతను ఆవిష్కరించారు. స్మార్ట్ డిజిటల్ స్టెతస్కోప్‌ను రూపొందించారు. యూఎస్ ఎంబసీ సహకారంతో ఉకాన్ గ్లోబల్ సంస్థ భాగస్వామ్యంతో ఢిల్లీలోని అమెరికన్ సెంటర్‌లో నిర్వహించిన స్టార్టప్ నెక్సస్ కోహోర్ట్–20 ప్రొగ్రామ్‌లో ఈ పరికరం ప్రదర్శించి సర్టిఫికెట్ అందుకున్నారు. బుధవారం ఈ మేరకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ, విభాగాధిపతి ప్రొఫెసర్ జోత్స్నారాణి అభినందనలు తెలిపారు.
తీరంలో కట్టుదిట్టంగా నిఘా
వాకాడు : సముద్ర మార్గం నుంచి అసాంఘిక శక్తులు చొరబడకుండా మైరెన్ పోలీసులు తీరంలో కట్టుదిట్టంగా నిఘా ఏర్పాటు చేశారు. బుధవారం ఈ మేరకు సాగర్ కా వాచ్ కార్యక్రమం చేపట్టారు. దుగరాజపట్నం మైరెన్ సీఐ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సముద్ర తీరంలో నిఘా పరిశీలించేందుకు తమ సిబ్బంది రెండు గ్రూపులుగా సముద్రంలోకి వెళ్లారని చెప్పారు. ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, కృష్ణపట్నం, చిల్లకూరు, కోట, వాకాడు మండలాలలోని సముద్ర తీరంలో 120 మంది పోలీస్ సిబ్బందితో సాగర్ కా వాచ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందులో నాయుడుపేట, గూడూరు డీఎస్పీలు, వాకాడు, గూడూరు, మనుబోలు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 120 మంది పోలీసులు పాల్గొన్నారని వెల్లడించారు.
వెటర్నరీ వర్సిటీలో మధ్యప్రదేశ్ మంత్రి


