బాధ్యతగా తాబేళ్ల సంరక్షణ
చిల్లకూరు : అంతరించిపోతున్న ఆలివ్ రెడ్లీ తాబేళ్ల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం చిల్లకూరు మండలం గమ్మళ్లదిబ్బ బీచ్ వద్ద అటవీశాఖ, జిందాల్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఆలివ్ రెడ్లీ తాబేళ్లను సముద్రంలోకి వదిలిపెట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ సముద్రం పరిశుభ్రతకు తాబేళ్లు దోహదపడతాయన్నారు. వాటి పరిరక్షణకు మత్స్యకారులు సైతం కృషి చేయాలని కోరారు. ఇటీవల ఆలివ్ రెడ్లీ తాబేళ్లు పలు ప్రాంతాల్లో మృత్యువాత పడినట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. దీంతో సముద్రంలో కాలుష్యం పెరిగిపోయే ప్రమాదముందని, అందుకే కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా తాబేళ్ల రక్షణ బాధ్యతను స్థానిక పరిశ్రమల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే గమ్మళ్లదిబ్బతోపాటు కోట మండలం శ్రీనివాససత్రం బీచ్‌లలో తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదులుతున్నామన్నారు. దీంతో సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తాబేళ్లు ఈ బీచ్‌లకే వచ్చి గుడ్లు పెడతాయని వివరించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ గుడ్లను సేకరించి హేచరీల్లో పొదిగిస్తారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి సముద్రంలో చేపల వేట కూడా ఉన్నందున, ఈ సందర్భంలో పిల్లలు కూడా పెరిగే అవకాశముంటుందని వివరించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు వివేక్, ఆఫ్జల్, రవీంద్ర, ధనలక్ష్మి, గాయం శ్రీనివాసులు, గోపి, తహసీల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్ నెల్లిపూడి సుబ్రమణ్యం, జిందాల్ ప్లాంట్ హెడ్ శ్రీనివాస్‌రావ్, స్థానిక నేతలు వెంకటేశ్వర్లు రెడ్డి, సతీష్‌యాదవ్ పాల్గొన్నారు.
కోట మండలంలో ...
కోట మండలం శ్రీనివాససత్రం బీచ్ వద్ద కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆలివ్‌రెడ్లీ తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. కలెక్టర్ మాట్లాడుతూ సమత్స్యకారులు వేట సాగించే సమయంలో తాబేళ్లు వలలకు చిక్కినా వాటిని తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టాలని సూచించారు.


