ఆటవిక చర్యలు ఆగవా?
శ్రీకాళహస్తి : సమాజంలో ఇంకా నిమ్న కులాలపై అగ్ర కులాల దురహంకార దాడులు చేయడం హేయమైన చర్యగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి శ్రీకాళహస్తి డివిజన్ కార్యదర్శి రెడ్డిపల్లి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర కులాల దాడిలో గాయపడి స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విరూపాక్షపురం గిరిజనులను శనివారం కేవీపీఎస్ నాయకులతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గద్దగుంటకు చెందిన చైతన్య విచక్షణా రహితంగా వెంకటేష్ (35), నాగయ్య(60)పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, గురునాథం, సంక్రాంతి వెంకటయ్య పాల్గొన్నారు.
ఆటో బోల్తా
– మహిళ మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: ఆటో అదుపు తప్పి గుంతలో బోల్తా పడడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన పదోమైలు గ్రామం కేటీరోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. కేవీబీపురం మండలం, తిమ్మభూపాలపురం గ్రామానికి చెందిన పుల్లారెడ్డి ఆయన భార్య మునెమ్మ (55), కుమారుడు భక్తవత్సలరెడ్డి ఉల్లిపాయలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం వదరయ్యపాళెం గ్రామంలోని సంతకు ఆటోలో ఉల్లిపాయలు తీసుకుని వెళ్తుండగా పదోమైలు గ్రామం వద్ద ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మునెమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పుల్లారెడ్డి, భక్తవత్సలరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మునెమ్మను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ విశ్వనాథనాయుడు తెలిపారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు
తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం సాయంత్రం రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా పలువురు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం, మిర్యాలగూడకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కారులో తిరుమల నుంచి అలిపిరికి మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా 13వ మలుపు వద్ద కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో భక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. అదేవిధంగా తమిళనాడు, చైన్నెకి చెందిన 13 మంది భక్తులు టెంపోట్రావెలర్లో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా మొదటి మలుపు వద్ద కారు అదుపుతప్పి రక్షణ గౌడను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఘాట్రోడ్డు భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఆటవిక చర్యలు ఆగవా?


