గోవిందా..భద్రత ఉందా?
పవిత్ర క్షేత్రంలో అపవిత్రం
● యథేచ్ఛగా నిషేధిత వస్తువులు ● పాదరక్షకులతో మహద్వారం వరకు వచ్చిన భక్తులు ● తిరుమల భద్రత గాలికి
తిరుమల: తిరుమల క్షేత్రంలో భద్రత కరువైంది. కొద్ది రోజులుగా వైకుంఠ వాసుని చెంత జరుగుతున్న వరుస సంఘటనలే దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై నిఘా ఉంచాల్సిన సంబంధిత ఉన్నతాధికారులు పటిష్ట భద్రత ఉందంటూ ఊకదంపుడు ప్రసంగాలకే పరిమితమవ్వడం విమర్శలకు తావిస్తోంది.
ఇవి కనిపించలేదా గోవిందా?
● వారం క్రితం అలిపిరి టోల్గేట్ దాటుకుని ఒక ముస్లిం యువకుడు తనిఖీలు చేసుకోకుండా.. భద్రతా సిబ్బంది ఆపుతున్నా ఆగకుండా.. ముస్లిం వస్త్రాన్ని ధరించి ద్విచక్ర వాహనంపై తిరుమలకు చేరుకున్నాడు. తర్వాత తిరుమలలోని టోల్గేట్ వద్ద ఆ యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని టోల్గేట్ వద్దే అదుపు చేయలేకపోవడం అక్కడి భద్రత డొల్లతనం ఎత్తిచూపుతోంది.
● పది రోజుల క్రితం పాపవినాశనం డ్యాంలో అటవీశాఖ అధికారులు బోటింగ్ ప్రక్రియ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. పాపవినాశనానికి బోట్లు వచ్చిన సంగతి మీడియాలో వచ్చేవరకు ఉన్నతాధికారులకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో.
● మద్యం, సిగరెట్, గంజాయి వంటివి గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. వాటిని సేవించిన తర్వాత మందుబాబులు తిరుమలలో హల్‌చల్ చేస్తున్నారు. మాడ వీధులు మొదలుకుని అధికారులు నివాసం ఉండే ప్రాంతం వరకు కలియతిరుగుతున్నా వారిని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు.
● శనివారం మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముకేష్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవాణి టికెట్టుపై శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్–1 మీదుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. మహద్వారం వద్ద పనిచేసే టీటీడీ భద్రతా సిబ్బంది వీరిద్దరూ డిస్పోజబుల్ పాదరక్షలను ధరించి వచ్చినట్లు గుర్తించి వాటిని తొలగింపజేశారు. డిస్పోజబుల్ పాదరక్షలతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ క్యూలోకి ప్రవేశించి మహద్వారం వద్దకు వచ్చే వరకు ఎవ్వరూ గుర్తించకపోవడం అక్కడ భద్రత.. తనిఖీలు ఎలా ఉన్నాయో తేటతెల్లమవుతోంది.
శాశ్వత సీవీఎస్వో లేకపోవడమే కారణమా?
కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను ఇబ్బడిముబ్బడిగా బదిలీ చేశారు. ఇందులో భాగంగా తిరుమలలో పనిచేస్తున్న నరసింహకిషోర్ కొన్ని నెలల క్రితం బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత శాశ్వత సీవీఎస్వోను నియమించలేదు. అప్పటి నుంచి ఇన్‌చార్జ్ సీవీఎస్వోలతోనే భద్రతను నెట్టుకొస్తున్నారు. దీనికితోడు భద్రతా సిబ్బంది, విజిలెన్స్ అధికారులు సక్రమంగా తనిఖీలు చేయడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికారణంగానే తిరుమలలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
తిరుమలలో ఘోర అపచారాలు
పాదరక్షకులతో శ్రీవారి దర్శనానికి భక్తులు టీటీడీలో భద్రత డొల్లతనం బట్టబయలు గోవుల మృతిపై విచారణ జరిపించాలి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర అపచారాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏదో ఒక సంఘటనలతో తిరుమల పవిత్రతను టీటీడీ అధికారులు మంటగలుపుతున్నారన్నారు. సాక్ష్యాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఆలయ మహద్వారం వరకు ముగ్గురు భక్తులు పాదరక్షకులతో రావడమే అందుకు నిదర్శనమన్నారు. తిరుమల మాడవీధుల్లోనే కాళ్లకు పాద రక్షకులు ధరించి తిరగడం నిషేధమన్నారు. అలాంటిది తిరుమల క్యూకాంప్లెక్స్‌లోకి ఎలా అనుమతించారు? అక్కడ నుంచి శ్రీవారి ఆలయ మహద్వారం వరకు పాదరక్షకులతో వస్తున్నా పట్టించుకోకుండా భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే దీనిపై టీటీడీ అధికారులు అవి పాదరక్షకులు కాదు చెవులకు రింగులు అని కూడా బుకాయిస్తారని మండిపడ్డారు. మేజోళ్లకు అనుమతి ఉందని టీటీడీ అధికారులు చెప్పినట్లు తెలిసిందన్నారు.
వివరణ ఇచ్చి సరిపెట్టుకోవడం కుదరదు
తిరుమలలో వరుసగా జరుగుతున్న ఘోర అపచారాలను తాము ప్రశ్నిస్తే వాటిపై వితండ వాదనలు, వివరణలు ఇచ్చి సరిపెట్టుకోవాలంటే కుదరదని భూమన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు చెప్పినప్పటి నుంచే ఇంతటి ఘోర అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమల పవిత్రతను కాపాడలేని టీటీడీ పాలక మండలి వెంటనే రాజీనామా చేయాలని, తిరుమలలో భద్రతా వైఫల్యాలకు కారకులైన అధికారులు, సిబ్బందిని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పదండి.. నిరూపిస్తా
గోమాతకు జరుగుతున్న నష్టంపైన మాట్లాడితే తనపై, జగన్‌మోహన్‌రెడ్డిపైన వ్యక్తిగత దాడికి ఆనం రామనారాయణరెడ్డితో పాటు చిన్న స్థాయి వ్యక్తులంతా మాట్లాడడం సరికాదన్నారు. గోశాలలో ఆవులు చనిపోయిన మాట నిజమని, అందుకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. అక్కడికి తనతో పాటు మీడియాను తీసుకెళితే అక్కడ పూడ్చిపెట్టిన ఆవుల కళేబరాలన్నింటినీ వెలికి తీద్దామన్నారు. గోవుల మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, తిరుతపి టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, డైరెక్టర్ మహ్మద్ ఖాసిం, ఎస్సీ విభాగం నాయకుడు కల్లూరి చంగయ్య పాల్గొన్నారు.
గోవిందా..భద్రత ఉందా?


