ముగిసిన శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు
తిరుపతి కల్చరల్: శ్రీరామచంద్ర పుష్కరిణిలో గత మూడు రోజులుగా చేపట్టిన శ్రీకోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజైన శనివారం రాత్రి స్వామి వారు తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం స్వామి,అమ్మవార్లు శ్రీరామచంద్ర పుష్కరిణికి వేంచేశారు. సుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు విహరించి భక్తులను కనువిందు చేశారు. ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.


