అంతా నిజం..
● కూటమి సర్కారును కుదిపేస్తున్న టీటీడీ గోశాల ఘటన ● గోవుల మృతి నిజమేనని మరోసారి ఒప్పుకున్న టీటీడీ చైర్మన్ ● 20 నుంచి 22 వరకు మరణించాయన్న బీఆర్ నాయుడు ● 40 మృత్యువాత పడినట్లు ఎమ్మెల్యే ఆరణి వెల్లడి ● వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన భూమనకు బెదిరింపులు ● కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతామని హెచ్చరికలు
కలియుగ వైకుంఠనాథుని సన్నిధిలోని టీటీడీ గోశాలలో మృత్యుఘోష భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. పరమ పవిత్రంగా పూజించే గోమాత దుస్థితి హృదయాలను కలచివేస్తోంది. పదుల సంఖ్యలో గోవులు మరణించిన ఘటన కూటమి సర్కారును కుదిపేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దలందరూ వేర్వేరుగా ప్రెస్‌మీట్‌లు పెట్టేశారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. గోవులు మరణించడం నిజం అంటూనే.. భూమన అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఒకరికొకరు పొంతన లేకుండా అలవోకగా అబద్ధాలు వల్లించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పిస్తామని బెదిరింపులకు తెగబడ్డారు.
గోశాలను పరిశీలిస్తున్న టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : టీటీడీ గోశాలలో గోవుల మృతి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికంగా మారింది. అమరావతి నుంచి వచ్చిన ఆదేశాలతో తిరుపతిలో ఆదివారం కూటమి నేతల హడావుడి కనిపించింది. ఎవరికి వారు విలేకరుల సమావేశం నిర్వహించి వైఎస్సార్‌సీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పినవన్నీ అసత్యాలు అంటూనే.. ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గోవులు మృతి చెందడం వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే వందకుపై చిలుకు కాదని, 40 అని ఎమ్మెల్యే, 20 నుంచి 22 వరకు అని టీటీడీ చైర్మన్ వెల్లడించడం గమనార్హం. ఎస్వీ గోశాలలో గోమాతలు మృత్యువాత పడుతున్నాయని టీటీడీ మాజీ చైరర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆధారాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. దీంతో కూటమి సర్కారు ఉలిక్కిపడింది. ఏం చేయాలో దిక్కుతోచక.. భూమన ఆరోపణలను టీటీడీ కొట్టిపారేసినా.. నిజం దాగదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రకటనలతో నిరూపితమైంది. వృద్ధాప్యం, వివిధ కారణాలతో గోవులు మృతి చెందడం సర్వసాధారణమని బీఆర్ నాయుడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరణి మాత్రం.. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీఎస్వీ గోశాలలో 40 గోవులు మృతి చెందాయని వెల్లడించారు. అయితే అవన్నీ అనారోగ్యంతో మరణించాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం తాజాగా టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యుడితోపాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా 20 నుంచి 22 వరకు మృతి చెంది ఉండొచ్చని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరోసారి స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ‘ఇంట్లో మనుషులు చనిపోరా? గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి’అంటూ చెప్పుకొచ్చారు. గోవు కళేబరాల ఫొటోలు చూపిస్తూ ఇవన్నీ మార్ఫింగ్ అని, ఎక్కడో మృతి చెందినవి అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. టీటీడీ గోశాలలో ఉండాల్సిన డాక్టర్ల కంటే తక్కువగా ఉన్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. మామూలుగా ఇక్కడ ఆరుగురు డాక్టర్లు ఉండాలని, ప్రస్తుతం ఒకరు పరారీలో ఉన్నారని, మరొకరు ఏదో కారణంతో రాలేదని టీటీడీ చైర్మన్ మీడియా సమక్షంలోనే ఒప్పుకున్నారు.
ప్రశ్నించే గొంతుకను నొక్కేసే కుట్ర
టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందుతున్నాయని భూమన కరుణాకరరెడ్డి వెల్లడించిన వాస్తవాలపై ఎల్లో మీడియా ప్రతినిధులు శ్రీభూమనపై కేసులు నమోదు చేస్తారా? అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పదే పదే ప్రశ్నించారు. ఎల్లో మీడియా ఒత్తిడి మేరకు భూమన కరుణాకరరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదుచేస్తామని, ఇప్పటికే కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటూ పరోక్షంగా పోసాని కృష్ణమురళిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీటీడీపై అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఈ మేరకు రాబోయే బోర్డు సమావేశంలో తీర్మానం కూడా చేస్తామని భాను ప్రకాష్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీపై ఇష్టారాజ్యంగా అసత్య ప్రచారాలు చేసిన ఇదే నాయకులు నేడు ఇలా మాట్లాడుతుండడంపై తిరుమల, తిరుపతి వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు.
అంతా నిజం..


