అంబేడ్కర్ స్ఫూర్తికి బీజేపీ తూట్లు
తిరుపతి కల్చరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తికి బీజేపీ తూట్లు పొడుస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో తిరుపతిలోని గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పును బీజేపీ నేతలు బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చట్టసభలపై కోర్టుల జోక్యం ఎక్కువైందని గవర్నర్లు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. గవర్నర్ తరహా పాలనను రద్దు చేసి చట్టసభలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగాన్ని మతోన్మాదుల నుంచి పరిరక్షించుకోవడానికి పౌరులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీని రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీ వాడకూడదని సూచించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ


