టీడీపీ పతనం ఖాయం
● రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన వెంకటగిరి మున్సిపల్ అవిశ్వాస తీర్మానం ● 2027లో జమిలీ ఎన్నికలు రావడం ఖాయం
వెంకటగిరి(సైదాపురం): మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కాభానుప్రియ పై కూటమి ప్రభుత్వం పెట్టిన అవిశ్వాస తీర్మానం రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించిందని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో సోమవారం ఆయన మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికార మదంతో కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడినట్లు ఆరోపించారు. అధికారులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి బెదిరింపులు, ఒత్తిళ్లకు గురిచేశారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతో 19 మంది కౌన్సిలర్లు ప్రలోభాలకు గురికాకుండా అవిశాస తీర్మానంలో దీటుగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం బలం లేక చతికిల పడిందన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయిందని చెప్పారు. ఈ విజయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కానుకగా ఇచ్చినట్టు తెలిపారు. 2027లో జమిలీ ఎన్నికలు రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియ, విప్ పుజారి లక్ష్మి, వైస్‌చైర్మన్ చింతపట్ల ఉమామహేశ్వరి, కౌన్సిలర్లు ధనియాల రాధ, తంబా సుఖన్య, కళ్యాణి, వహిద, సుబ్బారావు, శివయ్య, పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, జిల్లా సంయుక్త సహాయక కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


