విన్నమాల అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి
నాయుడుపేట టౌన్ : చైన్నె – కలకల్తా 16వ నంబర్ జాతీయ రహదారి విన్నమాల వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి తనవంతు కృషిచేస్తానని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు. విన్నమాల గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు సోమవారం విన్నమాల జాతీయ రహదారి కూడలి ప్రాంతాన్ని ఎంపీ పరిశీలించారు. విన్నమాల జాతీయ రహదారి కూడలి వద్ద ఐదు గ్రామాలకు పైగా రోజూ రాకపోకలు సాగిస్తుంటారని, రోడ్డు దాటుతూ అనేక మంది మరణించిన సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు ఎంపీకి వివరించారు. స్పందించిన ఎంపీ వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఈ సమస్యను కేంద్ర మంత్రి, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. విన్నమాల జాతీయ రహదారి కూడలి వద్ద అండర్ పాస్ బ్రిడ్జితో పాటు సాగరమాల జాతీయ రహదారికి సంబంధించి రైతుల పొలాలు సాగుచేసుకునేందుకు సర్వీస్ రోడ్లు నిర్మించే విధంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. సాగరమాల జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులను సైతం స్వయంగా కలిసి విన్నవించినట్లు ఎంపీ వెల్లడించారు. ప్రజాసంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు. ఎంపీ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగిరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, తిప్పలపూడి నాగరాజు, మీజూరు సుబ్రమణ్యం, విన్నమాల గ్రామస్తులు ఉన్నారు.


