ఖనిజాన్ని గ్రహించలేరా?
● కాలం చెల్లిన మైన్‌ను అడ్డుపెట్టుకుని తవ్వకాలు ● చెలరేగిపోతున్న నెల్లూరుకు చెందిన ప్రజాప్రతినిధి ● గతంలో ఉన్న మెటీరియల్ పేరుతో అనుమతులు ● బయట తవ్వి అదే పర్మిట్లతో తరలింపు ● గుర్రుమంటున్న స్థానిక కూటమి నేతలు ● కన్నెత్తి చూడని అధికారులు
సాక్షి, టాస్క్‌పోర్సు: గూడూరు మండలం, చెన్నూరులో మూతపడ్డ శ్రీనివాస మైన్‌ని అడ్డం పెట్టుకుని నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి చెలరేగిపోతున్నారు. స్థానిక కూటమి నేతలను పక్కకు నెట్టి తన రాజకీయ పలుకబడితో దందా సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా మైన్‌లో ఉన్న ఖనిజాన్ని తరలించేందుకు పర్మిట్లు పొందారు. ఆపై ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి అక్కడ సేకరించే తెల్లరాయిని సదరు మైన్‌కి తరలించి గ్రేడింగ్ చేస్తున్నారు. తర్వాత ఎంచక్కా ట్రిప్పర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా కొన్నివేల టన్నుల క్వార్ట్జ్ ఖనిజం తరలిస్తున్నా అటువైపు కన్నెత్తి చూసేందుకు ఏ ఒక్క అధికారీ సాహసించకపోవడం గమనార్హం.
అధారాలిచ్చినా అడ్డుకోవడమేనా?
శ్రీనివాస మైన్‌ను అడ్డంపెట్టుకుని అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని, దీనికి సబంధించిన ఆధారాలను నాలుగు రోజుల క్రితం గూడూరు డీఎస్పీ, సబ్ కలెక్టర్‌కు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అందించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు తమకు అనుమతులు ఇవ్వాలని ఆయన అధికారులను అభ్యర్థించారు. దానికి అప్పట్లో సదరు అధికారులు ఒప్పుకున్నట్టుగా మిన్నకుండిపోయారు. ఆపై మైన్ వద్దకు మేరిగ బయలుదేరే సమయంలో అనుమతులు లేవంటూ మెలిక పెట్టి హౌస్ అరెస్ట్‌కు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న అక్రమార్కులు మైన్‌లో ఉన్న చిన్నచిన్న వాహనాలను సైతం రాత్రికి రాత్రే తరలించేశారు. బ్లాస్టింగ్ సైతం ఆపేశారు.
అక్రమ తవ్వకాలకు పోటాపోటీ
శ్రీనివాసా మైన్‌ని సాకుగా చూపి క్వార్ట్ ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు కూటమి నేతలు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగానే సదరు మైన్‌కు సంబంధించి ఓ భాగస్వామిని పక్కకు నెట్టి అందులో ఉన్న మెటీరియల్‌ను తరలించేందుకు సిద్ధమయ్యారు. ఆ భాగస్వామి కోర్టును ఆశ్రయించినా అతన్ని కాదని స్థానిక ప్రజాప్రతినిధి అండతో కొందరు కూటమి నేతలు తవ్వకాలకు తెగబడ్డారు. విషయం తెలుసుకున్న నెల్లూరుకు చెందిన ఓ పెద్ద ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. తన అనుచర గణంతో అక్కడ పాగా వేశారు. ముందుగా సదరు మైన్‌లో ఉన్న మెటీరియల్‌ను తరలించేందుకు రాష్ట్ర స్థాయిలో పైరవీలు చేసి అనుమతులు పొందారు. ఆపై మైన్‌కు దగ్గరగా ఉన్న ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేపట్టి అక్కడ సేకరించిన తెల్లరాయిని అదే మైన్‌కి తరలించి గ్రేడింగ్ చేస్తున్నారు. పాత మెటీరియల్ కింద ప్రతి రోజూ కనీసం పది టిప్పర్లకు తక్కువ లేకుండా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా ఈ దందా సాగుతోంది.
ఇది తప్పుకాదా రాజా?
గతంలో తవ్వకాలు జరిపారంటూ నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిపై అక్రమ కేసులు బనాయించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే తాజాగా అదే కూటమికి చెందిన ఓ నేత అందరి కళ్లెదుటే తవ్వకాలు జరుపుతున్నా ఆయనపై ఎలాంటి చర్యలకు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఖనిజాన్ని గ్రహించలేరా?
ఖనిజాన్ని గ్రహించలేరా?
ఖనిజాన్ని గ్రహించలేరా?


