కొండకు ట్రిప్పులు పెంచుదాం
తిరుపతి అర్బన్: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల కొండకు భక్తులు పెరుగుతున్నారు, మరింత పెరిగే అవకాశాలున్నాయని, కొండకు బస్సు ట్రిప్పులు పెంచుదామని డీపీటీఓ నరసింహులు, డిప్యూటీ సీటీఎం విశ్వనాథం మంగళవారం డీపీటీఓ కార్యాలయంలో చర్చించుకున్నారు. ఈ నెల 16 నుంచి అదనపు ట్రిప్పులు తిప్పడానికి నిర్ణయించారు. ప్రస్తుతం 405 సర్వీసులు రోజుకు 1,650 ట్రిప్పులు నడుపుతున్నారు. బుధవారం నుంచి అదనంగా సత్యవేడు డిపోకు చెందిన 9, పుత్తూరు డిపోకు చెందిన 9, శ్రీకాళహస్తి డిపోకు చెందిన 25 సర్వీసులను తిరుమల కొండకు నడపనున్నారు. దీంతో రోజుకు 1950 ట్రిప్పులు తక్కువ లేకుండా కొండకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రస్తుతం తిరుప తి ఏడుకొండల బస్టాండ్‌లో టిక్కెట్ కౌంటర్ ఒక్కటి మాత్రమే ఉందని, భక్తుల రద్దీని బట్టి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత సర్కార్‌లో ఏర్పాటు చేసిన 100 విద్యుత్ బస్సుల్లో 85శాతం సర్వీసులు మాత్రమే వాడుకలో ఉన్నాయి. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యుత్ సర్వీసుల నిర్వాహణాధికారి జగదీష్, అలిపిరి డీఎం హరిబాబుతో మాట్లాడి 85 శాతం నుంచి 95 శాతానికి సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని చర్చించారు. ఈ విషయంపై డీపీటీఓ నరసింహులు మాట్లాడుతూ వేసవి నేపథ్యంతోపాటు విద్యార్థులకు ఏప్రిల్ 23 నుంచి సెలవులున్న క్రమంలో తిరుమల కొండకు అదనపు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే వందశాతం విద్యుత్ బస్సులను వాడుకలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.


