న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాం
● తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
రేణిగుంట: శ్రీకాళహస్తి మండలం పోలి భీమవరానికి చెందిన చిన్నమనాయుడు భార్య సంధ్య కుటుంబానికి అండగా నిలబడి, న్యాయం కోసం న్యాయస్థానం ఆశ్రయిస్తామని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు. పోలి భీమవరం గ్రామానికి చెందిన సంధ్య అనే మహిళ, ఆమె భర్త చిన్నమనాయుడితో శ్రీకాళహస్తి రూరల్ ఎస్‌ఐ నరసింహరావు అవమానకరంగా ప్రవర్తించి, దాడి చేసినా చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై వారు బుధవారం తిరుపతిలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీని కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమనే కక్షతో పోలీసులు తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని, ఈనెల 11వ తేదీన ఉదయం ఎస్‌ఐ నరసింహరావు నేరుగా ఇంటికి వచ్చి సంధ్యను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి వారి ప్రత్యర్థులతో కొట్టించారని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీ మాట్లాడుతూ ఇది అత్యంత దుర్మార్గపు చర్య అన్నారు. శాంతి,భద్రతలను కాపాడాల్సిన స్థాయిలో ఉన్న పోలీసులే గ్రామాల్లో వర్గ, వైషమ్యాలను రెచ్చగొట్టి, మహిళపై పరుష పదజాలంతో దూషిస్తూ, ఆమైపె దాడికి దిగడం దౌర్భాగ్యమన్నారు. ఇంత జరిగినా ఆయనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ఎటుబోతోందని ప్రశ్నించారు. న్యాయం జరగకపోతే వైఎస్సార్ సీపీ బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బాధిత మహిళ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక, తమపై కక్ష కట్టి టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తన భర్త వైఎస్సార్ సీపీ కార్యకర్త కావడంతోనే తమ కుటుంబంలో అందరిపైనా తప్పుడు కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇంటర్ చదివే తన కుమారుడిపైనా కేసు పెట్టి భవిష్యత్తును నాశనం చేశారని ఆమె ఎంపీ ముందు వాపోయింది. దీంతో ఆయన వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.


