మౌలిక వసతులకు ప్రాధాన్యం
తిరుపతి అర్బన్: మౌలిక వసతుల ప్రాధాన్యతకు.. అ భివృద్ధికి సంబంధించిన అంశాలకు మొదటి స్థానం ఉంటుందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు అధికారులతో కలసి సమీక్షించారు. సంఘం చైర్మన్ మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన అంశాల కు కేంద్రం నుంచి నిధుల విడుదలకు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. స్థానిక సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి చేపట్టాల్సిన అంశాలను తెలియజేశారు. దీంతో స్పందించిన ఆయన ప్రాధాన్యత అంశాలకు మొదటి స్థానం ఉంటుందని చెప్పారు.
వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పరిశీలన
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట మండలం, తూకివాకం పంచాయతీలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ (చెత్త నుంచి సంపద కేంద్రం)ను గురువారం 16వ ఆర్థిక కమిషన్ బృంద సభ్యులు రిత్విక్ పాండే, అన్నే జార్జ్ మ్యాథ్యూ, కేకే మిశ్రా, అభయ్ మీనన్, ఆదిత్య పంత్, అమృత తదితరులు పరిశీలించారు. సదరు ప్లాంట్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్త నిర్వహణ, కంపోస్టు, బయో మెథనైజేశన్ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ నగరంలో రోజూ సుమారు 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను ఆరు రకాలుగా మారుస్తారని, ఇలా ఉత్పత్తయిన ఇసుక, గుల్లతో పేవర్స్ తయారు చేస్తారని తెలిపారు. ప్రతిరోజూ తడి చెత్త 150 టన్నులు, 75 టన్నులు పొడి చెత్త నిర్వహణ చేస్తున్నట్టు తెలిపారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్, జే.నివాస్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్‌రెడ్డి, అదనపు కమిషనర్ చరణ్‌తేజ్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, లైజన్ అధికారులు పాల్గొన్నారు.


